
13 నుంచి ఐద్వా రాష్ట్ర మహాసభలు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అనంతపురంలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగనున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు బి.పద్మ పిలుపునిచ్చారు. బుధవారం ఎన్జీవో హోమ్‌లో ఐద్వా జిల్లా కన్వీనర్ అల్లాడ లక్ష్మి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరగడంతో యువత జీవితాలు సర్వనాశనం అవుతున్నాయన్నారు. మహిళా ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలు మహిళా సాధికారత గాలికొదిలేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉద్యమాన్ని బలోపేతం చేసి, మహిళా హక్కుల సాధన దిశగా ఈ మహాసభలు మార్గదర్శకత్వం కానున్నాయన్నారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె.నాగమణి, సీఐటీయూ ఉపాధ్యక్షులు మహాలక్ష్మి, అంగన్‌వాడీ జిల్లా నాయకులు లతాదేవి, టి.ప్రవీణ, జి.అనురాధ, ఎం.లక్ష్మి, పి.శ్రీదేవి, జానకి, ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.