
నేత్రం.. జరభద్రం!
● చిన్నప్పటి నుంచే పెరుగుతున్న
కంటి సమస్యలు
● తీవ్రంగా ప్రభావం చూపుతున్న
ఫోన్ వినియోగం
● నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం
శ్రీకాకుళం కల్చరల్: సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అంతటి ప్రాముఖ్యత కలిగిన నేత్రాలపై కొందరు అశ్రద్ధ వహిస్తున్నారు. ఫలితంగా చిన్నప్పటి నుంచే దృష్టి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కళ్ల సంరక్షణపై అవగాహన పెంచేందుకు ఏటా అక్టోబర్‌లో వచ్చే రెండో గురువారాన్ని ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’గా జరుపుకుంటున్నారు. అంధత్వం, దృష్టిలోపం కలగకుండా ప్రజలను చైతన్యపరిచేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇలా వద్దు..
● నిద్రలేవగానే సెల్ చూడడం వల్ల ఒత్తిడి పెరిగి శరీరంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్రపోయే ముందు మొబైల్ వాడటం వల్ల నిద్రలేమి కలుగుతుంది.
● స్మార్ట్ ఫోన్ ఎక్కువ సమయం వాడితే కళ్లు పొడిబారి, మసకబారి తలనొప్పి మొదలవుతుంది. ‘డ్రై ఐ సిండ్రోమ్’ అనే కంటి వ్యాధికి గురవుతారు.
● విద్యార్థులు స్మార్ట్ ఫోన్‌లో ఎక్కువ సమయం అనుచితమైన విషయాలు, వీడియోలు చూడటం వల్ల నేర ప్రవృత్తికి మరలే ప్రమాదం ఉంది.
● కళ్లకు సరైన విశ్రాంతి లేకపోవతే చూపు మందగిస్తుంది. కళ్లు సరిగా కనపడక చిన్నతనంలోనే కళ్లద్దాలు వస్తాయి.
ఇలా ముద్దు..
● స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ స్క్రీన్‌కు కంటికి మధ్య కనీసం 25 అంగుళాల దూరం ఉండాలి.
● ప్రతి 20 నిమిషాలకు కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. నేత్రాలను క్రమపద్ధతి ప్రకారం మూసి తెరవడం వల్ల కళ్లు తేమగా మారి ప్రకాశవంతంగా ఉంటాయి.
● దృష్టిలోపం ఉన్నట్లు భావిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి కళ్లద్దాలు ధరించాలి.
● బ్లూరే కట్, యాంటీ గ్లేర్ గ్లాసెస్ ఉపయోగించడం మంచిది.
● ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
అవగాహన కల్పిస్తున్నాం..
జాతీయ అంధత్వ, దృష్టిలోప నివారణ కార్యక్రమంలో భాగంగా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎన్జీవో కంటి ఆసుపత్రుల్లో కంటి వైద్య సేవలు ఉచితంగా అందజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం.
– డాక్టర్ ఎస్.పుష్పలత, ప్రోగ్రాం మేనేజర్,
జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శ్రీకాకుళం
నేత్రాలపై శ్రద్ధ అవసరం..
కళ్లపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా చిన్నారుల కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. స్కూల్లో చేర్చే ముందే కంటిపరీక్షలు చేయించాలి. మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, 40 ఏళ్లు పైబడిన వారి ప్రతి ఏడాది తప్పని సరిగా నేత్రవైద్య నిపుణులను సంప్రదించడం వల్ల శాశ్వత అంధత్వం నుంచి తప్పించుకోవచ్చు.
– ఎం.ఆర్.కె.దాస్, ఆప్తాలమిక్ అధికారి

నేత్రం.. జరభద్రం!

నేత్రం.. జరభద్రం!