
రెవెన్యూ సిబ్బంది తీరుపై కలెక్టర్ ఆగ్రహం
కవిటి: బల్లిపుట్టుగ రైతుల జాయింట్ ఎల్‌పీఎం, వన్‌బీ, అడంగల్ తదితర భూముల సమస్యలపై రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తీవ్ర స్థాయిలోఆగ్రహం వ్యక్తం చేశారు. పలాస ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన నెలవారీ సమీక్షలో రైతుల సమస్యలపై తహసీల్దార్ మురళీమోహనరావును కలెక్టర్ ప్రశ్నించగా స్పందన లేకపోవడంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించేశారు. నేరుగా బల్లిపుట్టుగ విచ్చేసి క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడారు. వీఆర్‌ఓ నుంచి మండల స్థాయి అధికారి వరకు ఎవరూ తమ గ్రామానికి సమస్య పరిష్కారం కోసం రాలేదని చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 220 ఖాతాలకు సంబంధించి జాయింట్ ఎల్‌పీఎంలో నమోదైన రైతులందరి నోటీసులు జారీ చేసి నోషనల్ ఖాతాలుగా మార్చి డీఆర్‌ఓ ఎం.వెంకటేశ్వరరావు, పలాస ఆర్డీఓ వెంకటేష్ పర్యవేక్షణలో రైతులకు భూమి హక్కు కల్పించేందుకు చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ప్రతి రెండుగంటలకోసారి ఫోన్‌లో రివ్యూచేస్తానని తెలియజేసి వెనుదిరిగారు.