
కాసుల వరద
ఇసుకాసురులకు..
నరసన్నపేట :
ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి. పేరుకు ఉచితమైనా ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చేందుకు అమాంతం ధరలు పెంచేశారు. వంశధార నదిలో నీటి ఉద్ధతి పెరిగి నదీతీర గ్రామాల్లో వరద రావడం, ప్రస్తుతం నదిలో నీరు అధికంగా ప్రవహిస్తుండటంతో ఇసుకాసురులు ఇదే అదునుగా ధరలు పెంచేశారు. నదిలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయంటూ ఉచిత ఇసుక ధరలను అమాంతం పెంచేసి సామాన్యులను దోపిడీకి గురిచేస్తున్నారు.
పేరుకే ఉచితం..
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొమ్మిది నెలలు తర్వాత ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారు. ఇసుకను ఎవరైనా ఉచితంగా నది నుంచి తీసుకువెళ్లవచ్చని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. వేసవిలో ట్రాక్టర్ ఇసుక ధర రూ.900 నుంచి రూ.3 వేలు వరకూ జిల్లాలో విక్రయాలు సాగాయి. అదే ఆగస్టులో ఈ ధరలు కొంత పెంచారు. వర్షాకాలం వచ్చింది.. నదిలోనికి ట్రాక్టర్లు వెల్లడం లేదు.. ఇసుక తవ్వకాలకు ఇబ్బంది అవుతుందని ట్రాక్టర్లు యజమానులు, ఇసుకాసురులు ధరలు నాలుగైదు వందలు పెంచారు. తాజాగా వారం రోజులుగా వంశధార నదిలో నీటి ఉద్ధృతి పెరిగింది. సమీపం గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీనిని అలుసుగా తీసుకొని ఇసుకాసురులు ఉచిత ఇసుక ధరలను అమాంతంగా పెంచేశారు.
ముందే నిల్వలు..
వరద పరిస్థితి ఏర్పడుతుందని ముందుగా ఊహించిన ఇసుకాసురులు ఇప్పటికే జీడి తోటలు, తమ సొంత స్థలాలు, ఇళ్ల వద్ద భారీగా ఇసుక నిల్వ చేశారు. ఇదే ఇసుకను ఇప్పుడు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక నరసన్నపేట ప్రాంతంలో రూ.2300 పలుకుతోంది. దూరం బట్టి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఉచిత ఇసుక ధరలు ప్రస్తుతం జిల్లాలో రూ.5 వేలు వరకూ ఉన్నట్లు సమాచారం. లారీల్లో విశాఖకు తరలించే ఇసుక ధరలు కూడా బాగా పెరిగాయి. లారీ ఇసుక ప్రస్తుతం రూ.25వేల వరకూ విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఉచిత ఇసుకకు ఇంత ధరా అని గృహ నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి ఇసుక ధరలను అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు.
ట్రాక్టర్‌లో అమ్మకానికి తీసుకువెళ్తున్న ఇసుక
రూ.2400 చెల్లిస్తేనే..
ఇంటి పని చేస్తున్నాం. ఇసుక అవసరమని ప్రయత్నిస్తే ట్రాక్టర్ ఇసుక రూ.2400 అంటున్నారు. ఎందుకు ఇంత ధర అని ప్రశ్నిస్తే.. నదిలో నీరు వస్తుందమ్మా.. ఏదో మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ధరకు ఇస్తున్నాం.. లేకపోతే ఇంకా ఎక్కువ ధరే ఉంటుంది.. అని ట్రాక్టర్ డ్రైవర్ అంటున్నారు. అత్యవసరమై కొన్నాం.
– బోగి పద్మజ, అనుపోజు అరుణకుమారి, జగనన్న కాలనీ, గడ్డెయ్యపేట