
‘నష్టపరిహారం అందించాలని ధర్నా’
టెక్కలి రూరల్: మెళియాపుట్టి మండలం గంగరాజపురం సమీపంలో గల రాజయోగి గ్రానైట్ క్వారీలో మంగళవారం పిడుగుపడి మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలను ప్రభుత్వం అదుకోవాలని కోరుతూ.. గురువారం జిల్లా గ్రానైట్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో టెక్కలి జిల్లా ఆస్పత్రి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా జనరల్ సెక్రటరీ పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ పిడుగుపాటుతో పాటు ఎలక్ట్రికల్ షాక్ తగలడం వల్లనే ముగ్గురు మృతి చెందారని ఆరోపించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు క్వారీ యాజమాన్యం రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి రావాల్సిన బీమాలన్నీ ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి హెచ్.ఈశ్వరరావు, గ్రానైట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు చింతాడ తేజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నంబూరి షణ్ముఖరావు, క్వారీ కార్మీకులు తదితరులు పాల్గొన్నారు.