
కూర్మాలు, గోవులను చంపే సంస్కృతి మంచిది కాదు
గార: జిల్లాలోని పవిత్ర శ్రీకూర్మ క్షేత్రంలో కూర్మాలు, సింహాచలంలో గోవులను చంపే సంస్కృతి మంచిది కాదని గోవా గవర్నర్, శ్రీకూర్మనాథాలయం ధర్మకర్త పూసపాటి ఆశోకగజపతిరాజు అన్నారు. బుధవారం శ్రీకూర్మనాథాలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త హోదాలో ఆయన పాల్గొన్నారు. గవర్నర్ మాట్లాడుతూ సభ్యులు దైవ సేవ చేసేందుకే వచ్చామని భావించాలని, దేవునికి బాధ్యతతో పనిచేయాలన్నారు. చట్టరీత్యా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశారన్నారు. దేవస్థానంలోని ఆకుపసర చిత్రాలు (మ్యూరల్స్) వేసిన పూర్వీకుల నైపుణ్యాలను భావితరాలకు అందించాల్సి ఉందన్నారు. ట్రస్టు బోర్డు సభ్యులకు గైడ్‌లైన్స్ ఉన్న పత్రాలను ఇవ్వకపోవడంతో ఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వామిని దర్శించుకొని ఆలయంలో రాతి స్తంభాలు, ఆకుపసర చిత్రాలు, కాశీద్వారం పరిశీలించారు. శాలిహుండం బౌద్ధారామాలను సందర్శించి, కొండపై ఉన్న ఆరామాలను పరిశీలించారు. కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్‌పట్నాయిక్, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు, ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఆలయ ప్రధానార్చకులు చామర్ల సీతారామనృసింహాచార్యులు, సభ్యులుగా కై బాడి కుసుమకుమారి, పల్ల పెంటయ్య, గొండు శ్రీనివాసరావు, అంధవరపు మౌనిక, ఆరవెల్లి శ్వేతబిందు, తాన్ని సూరిబాబు, మళ్లా కల్యాణచక్రవర్తి, జమ్ము లక్ష్మీతో ఆలయ ఈవో కోట నరసింహానాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు.