
గూడ్స్ గోదాం.. తరలిపోనుందా?
ఆమదాలవలస : శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ ఆవరణలో సుమారు 60 ఏళ్ల కిందట ఏర్పాటైన గూడ్స్ గోదాం ఇక కనుమరుగు కానుందా? ఇక్కడి నుంచి దూసి రైల్వేస్టేషన్‌కు గోదాం తరలిపోనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తమకు సమాచారం ఇచ్చారని గోదాం కలాసీలు చెబుతున్నారు. ఇదే జరిగితే తాము కుటుంబాలతో సహా రోడ్డున పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఈ గోదాం వద్ద పెసలు, మినుములు,, జ్యూట్ వ్యాపారం జరిగేది. అనంతరం యూరియా, బియ్యం, ఐరన్ వంటి సరుకులను గూడ్స్ వేగన్‌లలో ఇక్కడ అన్‌లోడ్ చేసే పనిమొదలైంది. ఈ పని కోసం ఆమదాలవలస, శ్రీకాకుళం రూరల్ మండలాల్లోని ఊసవానిపేట, గేదెలవానిపేట, పాత ఆమదాలవలస, గేటు, పొన్నాం, నవనంబాడు, కుద్దిరాం, గొల్లపేట, అక్కవలస, పంతులపేట, మెట్టక్కివలస తదితర 20 గ్రామాల నుంచి సుమారు 400 కుటుంబాల కలాసీలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు గోదాముకు చేరుకున్న వేలాది బస్తాలను లారీల్లోకి వేసి జిల్లా వ్యాప్తంగా సరుకులు రవాణా చేస్తున్నారు. రవాణా రంగంలో లారీడ్రైవర్, క్లీనర్, ఓనర్లు సుమారు 400 మంది వరకు ఉంటారు. మొత్తమ్మీద ఈ గోదాములపై ఆధారపడి ప్రతిరోజూ 800 మంది వరకు ఉపాధి పొందుతున్నారు.
అమృత్‌భారత్‌లో భాగంగా..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమృత్‌భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద కోట్లాది రూపాయల వ్యయంతో శ్రీకాకుళం (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌లోనూ పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా స్టేషన్ ఆవరణలో ఉన్న గూడ్స్ గోదామును ఆమదాలవలస పక్క రైల్వేస్టేషన్ ఉన్న దూసి రైల్వే స్టేషన్ ఆవరణలోకి మార్చేందుకు రైల్వే అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి భువనేశ్వర్ నుంచి డీపీఆర్ కూడా తయారుచేసి శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్‌కు పంపించినట్లు తెలిసింది. ఈ మేరకు స్టేషన్ అధికారులు గూడ్స్ గోదాం ముఖ్య కాంట్రాక్టర్లకు సైతం విషయం తెలియజేసినట్లు సమాచారం. వారు ఆ విషయాన్ని కలాసీలకు చెప్పడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. గోదాం తరలింపు ప్రయత్నాలు మానుకోవాలని, లేదంటే ఉద్యమం తప్పదని కలాసీలు చెబుతున్నారు.
ఆమదాలవలస నుంచి దూసికి
మార్చేందుకు సన్నాహాలు
ఆందోళన చెందుతున్న గోదాం కలాసీలు
సుమారు 800 కుటుంబాలపై ప్రభావం

గూడ్స్ గోదాం.. తరలిపోనుందా?