
సురేఖా పాణిగ్రాహికి అంతిమ వీడ్కోలు
పలాస: ప్రముఖ విప్లవ కవి, శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధపోరాట నిర్మాతల్లో ఒకరైన సుబ్బారావు పాణిగ్రాహి సతీమణి సురేఖా పాణిగ్రాహి (87)కి శుక్రవారం ఉదయం పలాస మండలం బొడ్డపాడులో అంతిమ యాత్ర జరిగింది. ముందుగా బొడ్డపాడు కాలనీ నుంచి బొడ్డపాడు గ్రామ అమరవీరుల స్మారక మందిరం వద్దకు మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చారు. బంధువులు, వివిధ గ్రామా ల నుంచి వచ్చిన ప్రజాసంఘాల నాయకులు, విప్లవ కారులు, అభిమానులు పెద్ద ఎత్తున జోహార్లు అర్పించారు. అనంతరం అమరుల బంధుమిత్రుల సంఘం నాయకుడు తామాడ త్రిలోచనరావు అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ సురేఖా పాణిగ్రాహి మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బొడ్డపాడు శ్మశాన వాటిక వద్ద ప్రజాకళామండలి, అరుణోద య కళాకారుల పాటల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.