యోగా దినోత్సవానికి ప్రత్యేక కార్యాచరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21న విశాఖపట్నంలో జరిగే ముఖ్య కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు గ్రామస్థాయి వరకు యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఈ విషయాలను వెల్లడించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి మండలానికి ఓ మాస్టర్ ట్రైనర్‌ను నియమించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కేంద్రం, మండల కేంద్రాల తో పాటు ఇతర ప్రముఖ ప్రాంతాల్లో రోజువారీగా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారుల కు ఆదేశించారు. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకతతో యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీకాకు ళం జిల్లాలో మత్స్యకారులతో ఒకరోజు ప్రత్యేకంగా యోగా శిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు.


