
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్
శ్రీకాకుళం పాతబస్టాండ్ : సార్వత్రిక ఎన్నికలకు ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ వెల్లడించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎలక్ట్రోరల్స్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 18,26,953 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. వైఎస్సార్ సీపీ, టీడీపీలు మాత్రమే బూత్ స్థాయిలో రాజకీయ పార్టీల తరఫున బీఎల్‌ఏలను నియమించారని, ఇంకా సమయం ఉన్నందున మిగిలిన పార్టీలు కూడా నియమించుకోవాలని సూచించారు. జనవరి 5న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. దావాలు, అభ్యంతరాల దాఖలు (పీరియడ్ ఫర్ ఫిల్లింగ్ కై ్లమ్స్ అండ్ అబ్జెక్షన్స్) చేసేందుకు డిసెంబరు 9 వరకు గడువు ఉందన్నారు. తొలగించిన డెత్ ఓటర్ల వివరాలు కావాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకోరగా.. వివరాలు అందజేయాలని సూపరింటెండెంట్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఫారం–6,7, తదితర ఫారాలపై ఉన్న అభ్యంతరాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ప్రస్తుతం పోలింగ్ స్టేషన్ల మార్పులు లేవని స్పష్టం చేశారు. అంతకుముందు గొడౌన్‌లోని ఈవీఎంలను కలెక్టర్, నాయకులు పరిశీలించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, వైఎస్సార్ సీపీ నాయకుడు రౌతు శంకరరావు, టీడీపీ నేత పి.ఎం.జె.బాబు, కాంగ్రెస్ నేత డి.గోవింద మల్లిబాబు, బీఎస్పీ నాయకుడు ఎల్.సోమేశ్వరరావు, సీపీఎం నేత తేజేశ్వరరావు, సీ– సెక్షన్ సూపరింటెండెంట్ బి.ప్రకాశరావు, డీటీ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ప్రస్తుత ఓటర్లు 18,26,953 మంది
కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ వెల్లడి