కదిరి టౌన్: ప్రభుత్వం నిషేధించిన ‘ఐపీఎల్ విన్ ఆన్‌లైన్ బెట్టింగ్’ యాప్ కోసం బ్యాంకు ఖాతాలు అందించి వాటి ద్వారా బెట్టింగ్ లావాదేవీలు నడిపేలా సహకరించిన ఓ ముఠాను కదిరి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6,77,440తో పాటు ఆరు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, బ్యాంకు పాసుపుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 మంది సభ్యులున్న ముఠాలో ఆరుగురిని అరెస్టు చేయగా...మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ వెంకటేశ్వర్లు విలేకరులకు వెల్లడించారు.
డబ్బు ఎరవేసి... బ్యాంకు ఖాతా తీసి..
కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్లకు చెందిన కుటాగుళ్లకు చెందిన పఠాన్ జావిద్, ఎం.ద్వారకనాథ్‌రెడ్డి, ఇంద్రతేజ, అనిల్‌కుమార్, జహీర్‌ఖాన్, ఆకుల గణేష్, దండగుల విజయ్‌కుమార్, మౌలాలి, చింతమాను గణేష్, మనోజ్ సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఈ క్రమంలోనే టెలిగ్రామ్ చానల్ ద్వారా అనుమతి లేని ‘ఐపీఎల్ విన్ ఆన్‌లైన్ గేమింగ్’ యాప్ గురించి తెలుసుకుని యాప్ ప్రతినిధిగా చెప్పుకునే ప్రియా అనే అమ్మాయితో పరిచయం పెంచుకున్నారు. అనంతరం ఆన్‌లైన్ గేమింగ్ ఆడి గెలిచే వారికి డబ్బులు పంపేందుకు బ్యాంకు ఖాతాలు కావాలని ఆమె కోరగా...వీరంతా తొలుత తమ బ్యాంకు ఖాతాలిచ్చారు. వాటి ద్వారా యాప్‌లో గేమ్ ఆడి గెలిచిన వారి అకౌంట్లకు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు పంపేవారు. ఇందుకుగాను వీరికి రూ.లక్షకు రూ.1,000 నుంచి రూ.2 వేల వరకూ కమీషన్ ఇచ్చేవారు. అయితే వీరి అకౌంట్లు బ్లాక్ కావడంతో కుటుంబీకుల బ్యాంకు ఖాతాల ద్వారా దందా నడిపించారు. అవీ బ్లాక్ కావడంతో స్థానికులకు రూ.5 వేల చొప్పున డబ్బు ఆశచూపి పలువురి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపించారు. అనంతరం వారికి తెలియకుండానే ఆ ఖాతాల ద్వారా ‘ఐపీఎల్ విన్ ఆన్‌లైన్ గేమింగ్’ యాప్ లావాదేవీలు నడిపించారు. ఈ వ్యవహారంపై ఈనెల 8న తేదీన సమాచారం రావడంతో కదిరి పోలీసులు దాడి చేశారు. బెట్టింగ్ యాప్‌కు బ్యాంకు అకౌంట్లు అందించే ముఠాకు చెందిన కుటాగుళ్లకు చెందిన జహీర్‌ఖాన్, ఆకుల గణేష్, దండగుల విజయ్‌కుమార్, మౌలాలి, చింతమాను గణేష్, మనోజ్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు నిందితులు పఠాన్ జావిద్, ఎం.ద్వారకనాథ్‌రెడ్డి, ఇంద్రతేజ, అనిల్‌కుమార్ పరారయ్యారని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని సీఐ వెల్లడించారు. అనంతరం నిందితులను కోర్టులో ప్రవేశపెట్టిగా జడ్జి రిమాండ్ విధించడంతో సబ్‌జైలుకు తరలించారు. సమావేశంలో పట్టణ ఎస్‌ఐ బాబ్జాన్, పోలీస్ కానిస్టేబుళ్లు సూరి, శంకర్‌రెడ్డి, దేవా, రమణ పాల్గొన్నారు.
స్థానికుల నుంచి ఖాతాలు సమకూర్చిన
ఆరుగురి అరెస్టు, రిమాండ్
పరారీలో మరో నలుగురు
రూ.6,77,400 నగదు,
ఆరు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం
విలేకరుల సమావేశంలో
వివరాలు వెల్లడించిన
సీఐ వెంకటేశ్వర్లు


