హిందూపురం టౌన్: మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తాడు. శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యమూ చాలా ముఖ్యమే. చదువు పేరుతో విద్యార్థుల్లో విపరీతమైన ఒత్తిడి పెంచడం, ఉద్యోగులను టార్గెట్ల పేరుతో వేధించడం, సీ్త్రలకు పిల్లలు సకాలంలో పుట్టకపోతే తక్కువ చేసి చూడటం, కొన్ని శారీరక అనారోగ్యాలు, సామాజికంగా తక్కువ చేసి చూడటం.. ఇవన్నీ మనిషి మెదడుపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఏమి చేయలేమనే భావనతో అనేక మంది మానసిక రోగులుగా మారుతున్నారు. వీరికి సకాలంలో కౌన్సెలింగ్ ఇచ్చి ప్రాథమిక దశలోనే చికిత్స అందిస్తే కోలుకుంటారు. లేనిపక్షంలో వారి జీవితం నరకప్రాయంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో మతిస్థిమితం కోల్పోయే ప్రమాదం ఉంది. మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1992 నుంచి అక్టోబర్ 10వ తేదీని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తోంది.
మానసిక ఒత్తిడే ప్రధాన కారణం..
హడావుడి జీవితం, ఒత్తిడితో బతకడం నేటి సమాజంలో మామూలైంది. ఉమ్మడి కుటుంబాలు చిన్నా భిన్నమై, సమస్య వచ్చినప్పుడు సరిదిద్దే పెద్దలు లేకపోవడంతో చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థి దశ నుంచే పోటీతత్వం పెరిగిపోయింది. ర్యాంక్ పేరుతో ఇంట్లో తల్లిదండ్రులు, విద్యాలయాల్లో అధ్యాపకులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఆటపాటలు, ఆనందాల్లేవు. చదువు.. చదువు అంటూ ప్రాణాలు తోడేస్తున్నారు. సామాజికంగా చిన్నచూపు చూస్తూ ఇబ్బంది పెట్టిన ఘటనలో కొందరు మానసిక సమస్యలకు గురవుతున్నారు.
హిందూపురంలో ఆస్పత్రిలో
ప్రత్యేక డీఅడిక్షన్ సెంటర్
మానసిక రుగ్మతలతో బాధపడుతున్న అనేక మందికి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కౌన్సిలింగ్ నిర్వహించడంతోపాటు డీఅడిక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఓపీను సైతం నిర్వహిస్తుండటంతో రోజుకు 30 నుంచి 40 మంది దాకా వస్తుంటారు. డీ అడిక్షన్ సెంటర్‌లో 6 నుంచి 10 మంది దాకా అడ్మిట్‌లోనూ ఉంటున్నారు. మత్తు పదార్థాలకు బానిసైన వారు, ఆత్మహత్య ఆలోచనలు కలిగిన వారు, మానసికంగా సరిగా లేని వారు, జీవితంపై విరక్తి చెందిన వారు.. ఇలా ఎంతో మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సందర్భం: నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
నిర్లక్ష్యం చేస్తే మతిస్థిమితం కోల్పోయే ప్రమాదం
ప్రాథమిక దశలో చికిత్సతో
సాధారణ జీవితం


