వెనకొస్తానన్నావ్‌.. నన్ను విడిచి వెళ్లావా! | - | Sakshi
Sakshi News home page

వెనకొస్తానన్నావ్‌.. నన్ను విడిచి వెళ్లావా!

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

ఆత్మకూరు: వెనకొస్తానని చెప్పి నన్ను విడిచి కానరాని లోకాలకు వెళ్లావా అంటూ ఆ వ్యక్తి చేసిన ఆర్థనాదాలు చూపరులను కలచి వేశాయి. భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో భర్త రోదనలు మిన్నంటాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆత్మకూరుకు చెందిన అడ్డా శ్రీరామిరెడ్డి అడ్డా సరోజమ్మ పాడి పశువులతో జీవనం సాగించేవారు. ఉదయం భార్యాభర్తలు ఎనుములు తోలుకుని తోటకు వెళ్లాలనుకున్నారు. అయితే భార్య తాను మళ్లీ వస్తాననడంతో భర్త ముందుగా బయలుదేరాడు. ఆ తర్వాత ఆమె కాలినడకన బయలుదేరింది. నల్లలమ్మ ఆలయం వద్దకు రాగానే ఆత్మకూరుకు చెందిన బొమ్మయ్య తన మేనకోడలు అనుష్కతో కలసి బైక్‌పై వెళ్తుండగా లిఫ్ట్‌ అడిగింది. ఈక్రమంలో బైకుపై వెళ్తున్న ముగ్గురిని అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్తున్న ఓ ఐచర్‌ అతివేగంగా రాంగ్‌ రూట్‌లో వచ్చి ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన సరోజమ్మ (67) అక్కడికక్కడే మరణించింది. బొమ్మయ్య కాళ్లు చేతులకు బలంగా గాయాలయ్యాయి. అనుష్కకు స్వల్పగాయాలతో బయటపడింది. వారిని అంబులెన్స్‌లో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. బొమ్మయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. ఐచర్‌ వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో పోలీసులు వివరాలు సేకరించారు. వాహనం రాజస్థాన్‌కు చెందినదిగా గుర్తించారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎవరో అనుకుని..

ఎనుములు తోలుకెళ్తున్న శ్రీరామరెడ్డికి రోడ్డు ప్రమాదం విషయం తెలిసింది. ఎవరో అనుకుని ఆయన అలాగే వెళ్లిపోయాడు. తర్వాత తన భార్యే మృతి చెందినట్లు తెలియడంతో ఘటనస్థలికి చేరుకుని గుండెలు బాదుకున్నాడు. నా వెనుకే వస్తానన్నావ్‌.. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్లావా.. నేనొక్కడిని ఎలా బతకాలి అంటూ రోదించాడు. ఇదిలా ఉండగా ఐచర్‌ వెనుక వస్తున్న కారులోని సీసీ కెమెరాలో ఘటన మొత్తం రికార్డు అవ్వగా ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతితో

కన్నీరుమున్నీరైన భర్త

ఆత్మకూరు సమీపంలో ఘటన

ఇదే ప్రమాదంలో మరో వ్యక్తి,

మూడేళ్ల చిన్నారికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement