ధర్మవరం అర్బన్: ఈనెల 8,9 తేదీల్లో నెల్లూరు అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ 70వ రాష్ట్రస్థాయి ఊషు పోటీలలో ధర్మవరం విద్యార్థినులు ప్రతిభ చూపారని కోచ్ ఇనాయత్‌బాషా శుక్రవారం తెలిపారు. పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని వర్షిని అండర్–19 మైనస్ 42 కేజీ విభాగంలో సెమీ ఫైనల్స్‌లో బ్రాంజ్ మెడల్, అండర్–17 మైనస్ 52 కేజీ విభాగంలో ఏపీ మోడల్ స్కూల్‌లో 9వ తరగతి విద్యార్థిని నిమ్మల చైత్ర ఫైనల్ వరకు వెళ్లి సిల్వర్ మెడల్ సాధించిందన్నారు. ఇదిలా ఉండగా శనివారం పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో జరగనున్న రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో ధర్మవరం మల్టీస్టార్ బుడోఖాన్ కరాటే అకాడమీ విద్యార్థులు పోటీపడుతున్నట్లు కోచ్ తెలిపారు.
రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్‌కు కే. బసవన్నపల్లి విద్యార్థులు
హిందూపురం టౌన్: కే.బసవన్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం రవీంద్రరెడ్డి, పీడీలు సురేష్ కుమార్, అరుణ తెలిపారు. ఫుట్‌బాల్ అండర్–17 విభాగంలో 9వ తరగతి విద్యార్థి ఉమేష్ బాబు, పదో తరగతి విద్యార్థిని దీక్ష, రగ్బీలో పదో తరగతి విద్యార్థిని అమలజ ఎంపికయ్యారన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగే ఫుట్‌బాల్ పోటీలకు ఉమేష్ బాబు, దీక్ష, ఈ నెల 12, 13 తేదీల్లో కాకినాడలో జరిగే పోటీల్లో అమలజ పాల్గొంటారన్నారు. ఈసందర్భంగా వారు విద్యార్థులను అభినందించారు.
అపార్ట్‌మెంట్‌లో వ్యక్తి మృతి
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తిలో సాయి అపూర్వ అపార్టుమెంట్‌లో సమీర్ గుప్తా(44) అనే వ్యక్తి మృతి చెందారు. అర్బన్ సీఐ యువరాజ్ తెలిపిన వివరాలు.. పట్టణంలోని గోపురం 1వ క్రాస్ సాయి అపూర్వ అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్‌లో ఐదు రోజుల క్రితం సమీర గుప్తా అనే వ్యక్తి మరణించారు. ప్లాట్ నుంచి దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు వెస్ట్ ముంబయ్‌కి చెందిన ప్రమోద్‌గుప్తా, ఉషాగుప్తా దంపతుల కుమారుడిగా గుర్తించారు. ఇతడు ముంబయ్ ఐఐటీలో 2006–2010 వరకూ చదివినట్లు సమాచారం. మృతుడి వివరాలు తెలిసిన వారు పుట్టపర్తి అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.
రైలు కిందపడి కర్ణాటక యువకుడి ఆత్మహత్య
పామిడి: కుటుంబ కలహాలతో రైలు కిందపడి కర్ణాటకకు చెందిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు అందించిన వివరాలు.. కర్ణాటకలోని తుమకూరు జిల్లా వల్లూరు మండలం క్యాతగానచెర్లు గ్రామానికి చెందిన కేజీ దేవరాజు (23) గురువారం ఇంట్లో తండ్రి గోపాలప్పతో తగువులాడి ఇంట్లో నుంచి వచ్చేశాడు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం స్థానిక కేజీబీవీ స్కూల్ సమీపాన గుత్తి నుంచి అనంతపురం వైపునకు వెళ్తున్న రైలుకింద దూరాడు. ఘటనలో శరీరం తునాతునకలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజు హుటాహుటినా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించాడు. మృతుని వద్ద ఉన్న ఓటరుకార్డు, ఆధార్‌కార్డు ఆధారంగా ఆచూకీని గుర్తించారు. మృతదేహాన్ని గుత్తి ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
నేడు అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన
అనంతపురం సెంట్రల్ జిల్లా పోలీసు కార్యాలయంలోని షాదిఖానాలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన కేంద్రం ఏర్పాటు చేసినట్లు కర్నూలు సీఐడీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపాజిటర్, నామినీ, వారసులు, ఏజెంట్ల వివరాలు, ఒరిజనల్ బాండ్లు తీసుకురావాలని కోరారు. వివరాలకు సీఐడీ సీఐలు దస్తగిరి 7032397109, అశోక్ 8074564661, ప్రీతమ్‌రెడ్డి 9000099309 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


