ఆర్టీసీ ప్రైవేటీకరణ వద్దే వద్దు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ప్రైవేటీకరణ వద్దే వద్దు

Aug 4 2026 12:11 AM | Updated on Aug 4 2026 12:11 AM

క్లుప్తంగా

వర్షాల కోసం మహాయాగం

విద్యార్థుల భవితకు

బాటలు వేయాలి

పుట్టపర్తి అర్బన్‌: విద్యారంగంలో గుణాత్మక మార్పులు తీసుకురావాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఎంఈఓలు, క్లష్టర్‌ హెచ్‌ఎంలకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఉన్న మంగళకర ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌లో పాఠశాలల విద్యా ప్రగతి సూచీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్‌ మాట్లాడుతూ...విద్యలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుని జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాల విద్యే పునాది లాంటిదని, దీన్ని గుర్తించి నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలన్నారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. స్టార్‌ రేటింగ్‌ తక్కువగా ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతులు, అకడమిక్‌ ప్రమాణాలు పెంచాలన్నారు. విద్యాకిట్లు వంద శాతం అందజేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ కిష్టప్ప, సమగ్ర శిక్ష అధికారులు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

మందుబాబులపై కేసు

కదిరి టౌన్‌: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం నిందితులను కదిరి స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరచగా, ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా, మరొకరికి ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పేర్కొన్నారు. అలాగే, కదిరిలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అసౌకర్యం కలిగించిన 15 మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, జడ్జి జరిమానా విధించారన్నారు.

మద్యం తాగి బైక్‌ నడిపిన ఇద్దరికి జైలు

తలుపుల : మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన తలుపులలోని కుమ్మరపేట, ఎస్టీ కాలనీలకు చెందిన ఓబులేసు, సాయి అనే యువకులకు కదిరి మెజిస్టేట్‌ కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. రూ.10వేల జరిమానా విధించినా కట్టనందున వీరికి ఐదు రోజుల శిక్ష నిమిత్తం సబ్‌జైలుకు పంపినట్లు ఎస్‌ఐ చెన్నయ్య తెలిపారు.

బాధితులకు న్యాయం చేయండి: ఎస్పీ

పుట్టపర్తి టౌన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై చట్టపరిధిలో విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆదేశించారు. పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 85 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌ కుమార్‌ సమస్యలు ఓపికగా విని సంబంధిత పోలీస్‌ అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత సురనా, సీఐ బొజ్జప్ప, డీటీఆర్‌బీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, లీగల్‌ అడ్వైజర్‌ సాయినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

టెట్‌ రద్దు చేయాలి

పుట్టపర్తి: 2010కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని లేదంటే పూర్తిగా టెట్‌ను రద్దు చేయాలని వైఎస్సార్‌టీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి బడా హరిప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం బుక్కపట్నం మండలంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఐఆర్‌ ప్రకటించాలని, యాప్‌ల భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రతాప్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, సీనియర్‌ నాయకులు వెంకటేష్‌ బాబు, మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

జీనులకుంటలో మంచినీటి ఎద్దడిని నివారించాలి

గాండ్లపెంట: మండల పరిధిలోని జీనులకుంట పంచాయతీ కేంద్రంలో నెలకొన్న మంచినీటి ఎద్దడిని నివారించాలంటూ సోమవారం పార్టీలకు అతీతంగా గ్రామస్తులు మండల కేంద్రానికి తరలివచ్చారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎలుగూటివారిపల్లికి చెందిన రైతు చంద్రశేఖరరెడ్డి జీనులకుంటకు నీరు వెళ్లకుండా పైపులైన్‌ను ధ్వంసం చేశారని ఆరోపించారు. రైతుపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ సుమతి, ఎంపీడీఓ రామక్రిష్ణకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే రైతు చంద్రశేఖరరెడ్డిని ఎంపీడీఓ కార్యాలయం వద్దకు పిలిపించి ఎంపీడీఓ, ఎస్‌ఐలు మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం నేరమని హెచ్చరించారు. 4 రోజుల్లో పైపులైన్‌ను పునరుద్ధరిస్తానని అతను హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.

చంపుతామంటూ మెడికల్‌ ఆఫీసర్‌కు బెదిరింపులు

పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

పుట్టపర్తి అర్బన్‌: చంపుతామంటూ మెడికల్‌ ఆఫీసర్‌ను పలువురు బెదిరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌, బాధితుడు డాక్టర్‌ దిలీప్‌ కుమార్‌ తెలిపిన మేరకు.. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం పుట్టపర్తిలో డీఎంహెచ్‌ఓ ఫైరోజ బేగం అధ్యక్షతన జరిగిన సమావేశానికి దిలీప్‌ కుమార్‌ హాజరయ్యారు. ఆ సమయంలో ఆయనకు 9494457409 నంబర్‌ నుంచి కాల్‌ చేసిన వ్యక్తి తాను లింగా రామమోహన్‌ అని పరిచయం చేసుకున్నాడు. అసభ్యకరంగా దూషించాడు. మరో వ్యక్తి నిన్ను చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ క్రమంలోనే ఒక వాహనంలో గుర్తు తెలియని వ్యక్తులు వెంగళమ్మచెరువు పీహెచ్‌సీకి వెళ్లి తన గురించి విచారించినట్లు బాధిత డాక్టర్‌ తెలిపారు. తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో అమర్యాదగా మాట్లాడారని వాపోయారు. తనకు, కుటుంబానికి రక్షణ కల్పించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫైరోజ బేగం వద్ద మొర పెట్టుకున్నారు. ఆమె సూచనలతో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ యువరాజ్‌ పేర్కొన్నారు.

ప్రశాంతి నిలయం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఏ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ మందిరంలో ఎస్పీ సతీష్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌తో కలసి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పతాకావిష్కరణ, వేదిక ఏర్పాట్లు, అలంకరణ పనులను సుందరంగా చేపట్టాలన్నారు. పరేడ్‌ మైదానంలో బారికేడింగ్‌ తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, ప్రత్యేక అతిథులను గౌరవప్రదంగా ఆహ్వానించాలని సూచించారు. ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఆహ్వాన పత్రికలు, ప్రొటోకాల్‌ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా ప్రగతిని ప్రతిబింబించేలా శకటాలు, స్టాల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండాలన్నారు. ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్పీ సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని వేడుకలను విజయవంతం చేస్తామని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ అంకిత సురానా, డీఆర్‌ఓ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కష్టకాలంలోనూ రైతుపై బీమా బండ

రూ.55.79 కోట్ల ప్రీమియం చెల్లింపు

ఈనెల 15 తర్వాత వెల్లడికానున్న ఫసల్‌బీమా ప్రీమియం

అనంతపురం అగ్రికల్చర్‌: కష్టకాలంలోనూ చంద్రబాబు ప్రభుత్వం రైతులపై కోట్ల రూపాయల భారం మోపింది. 2019–2024 మధ్య వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతులపై ఎలాంటి భారం మోపకుండా ఉచితంగా పంటల బీమా పథకాలు అమలు చేసిన విషయం తెలిసిందే. పంట సాగు చేసి ఈ–క్రాప్‌ నమోదు చేసుకుంటే చాలు బీమా వర్తింపజేసి పెద్ద మొత్తంలో పరిహారం కూడా అందించి ఆదుకున్నారు. అలా వైఎస్‌ జగన్‌ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14.20 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.1,883 కోట్ల పరిహారం అందించి ఔరా అనిపించుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం 2024లో అధికారం చేపట్టగానే ఉచిత పంటల బీమా పథకాలకు మంగళం పాడేసింది. రైతులపై ప్రీమియం భారం మోపడంతో పాటు పరిహారం ఇవ్వకుండా దాటవేస్తుండటంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎల్‌–నినో వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత ఖరీఫ్‌లో బీమా పథకాలు ఆదుకుంటాయనే ఆశతో అప్పులు చేసి ప్రీమియం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం, బీమా కంపెనీలు సరైన ఏర్పాట్లు చేయకున్నా బ్యాంకులు, మీ–సేవా కేంద్రాలు, సీఎస్‌సీ సెంటర్లు, వ్యవసాయశాఖ కార్యాలయాలు, ఆర్‌ఎస్‌కేల వద్ద పడిగాపులు కాసి ప్రీమియం కట్టారు.

రూ.55.79 కోట్ల ప్రీమియం..

వాతావరణ బీమా పథకం కింద నోటిఫై చేసిన వేరుశనగ, పత్తి, చీనీ, దానిమ్మ, అరటి, టమాట పంటలకు ప్రీమియం గడువు ఆగస్టు ఒకటితో ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 1,70,967 మంది రైతులు తమ వాటా కింద రూ.55.79 కోట్ల ప్రీమియం చెల్లించారు. అందులో అనంతపురం జిల్లాలో 78,765 మంది రైతులు రూ.33.32 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 92,202 మంది రైతులు రూ.22.47 కోట్ల ప్రీమియం కట్టారు. ఆర్థికంగా చితికిపోయినా రూ.55.79 కోట్లు బీమా కంపెనీకి చెల్లించాల్సి వచ్చింది. రైతు ప్రీమియం కట్టిన తరువాత బీమా కంపెనీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా చెల్లించాల్సి ఉంటుంది. అనంతపురం జిల్లాలో 1.15 లక్షల హెక్టార్లకు, శ్రీ సత్యసాయి జిల్లాలో 1.18 లక్షల హెక్టార్లకు ప్రీమియం చెల్లించడంతో వాటి ఆధారంగా జిల్లాలో రూ.1,083 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.979 కోట్లు... వెరసి రూ.2,062 కోట్ల విలువ చేసే పంటలకు ప్రీమియం చెల్లించారు. ఇది కేవలం వాతావరణ బీమా పంటలకే. ఇంకా ఫసల్‌బీమా కింద నోటిఫై అయిన పంటలకు ఈనెల 15 వరకు గడువు ఉన్నందున ఎంతనేది ఆ తర్వాత వెల్లడి కానుంది.

కక్ష సాధింపులపై విమర్శల పర్వం

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రశాంత్‌ గౌడ్‌పై చందబ్రాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్‌ గౌడ్‌ వైఎస్సార్‌సీపీ నిరసనల్లో పాల్గొంటుండటంతో ఎమ్మెల్యే కార్యాలయం ఆదేశాలతో గతంలో అక్రమ కేసులు బనాయించారు. రెండు రోజుల క్రితం జరిగిన చిన్న గొడవలో తలదూర్చాడనే కారణంతో ఇరువర్గాలపైనా కేసులు నమోదు చేసిన హిందూపురం పోలీసులు, అందరికీ స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి ప్రశాంత్‌ గౌడ్‌ను మాత్రం రిమాండ్‌కు తరలించారు. ఈ విషయంలో పోలీసుల వైఖరిపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి కొమ్ముకాయడం సరికాదని, అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని నియోజకవర్గ ప్రజల్లో చర్చ నడుస్తోంది.

పుట్టపర్తి అర్బన్‌: చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, ఇందులో భాగంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టినట్లు ఏపీపీటీడీ జేఏసీ పేర్కొంది. సోమవారం సంతకాల సేకరణ పుస్తకాన్ని కలెక్టర్‌కు అందజేసి న్యాయం చేయాలని కోరారు. అనంతరం రెవెన్యూ భవన్‌లో చంద్రబాబు చిత్రపటం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ సీ్త్రశక్తి పథకం నేపథ్యంలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సహకారం అందిస్తున్నామన్నారు. ప్రయాణికులు పెరిగినా ఒక్క బస్సు గాని, సిబ్బందిని గానీ పెంచలేదన్నారు. పథకాన్ని సాకుగా చూపి ఎలక్ట్రిక్‌ బస్సులను నడపాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు వాటిని ప్రభుత్వమే నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు కొత్త బస్సులు నడపాలన్నారు. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వాలన్నారు. విద్యుత్‌ బస్సులతో కార్గో ఆదాయంలో నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ విలువైన స్థలాలను ప్రైవేటుకు ఇవ్వకుండా కాపాడాలన్నారు. 12వ పీఆర్సీ అమలు, ఐఆర్‌, పెండింగ్‌ డీఏలను ప్రకటించాలని, పెండింగ్‌ అరియర్స్‌, సరెండర్‌ లీవులు, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ బకాయిల చెల్లింపు తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వైపీ రావు, శ్రీరాంనాయక్‌, శ్రీనివాసులు, షబ్బీర్‌ తదితరులు ఉన్నారు.

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి

పుట్టపర్తి అర్బన్‌: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం ఏర్పడినందున వేరుశనగ సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఏరువాక జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రామసుబ్బయ్య పేర్కొన్నారు. సోమవారం పుట్టపర్తి వ్యవసాయాధికారి శ్రీవాణి అధ్యక్షతన పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు, బీడుపల్లి గ్రామాల్లో వివిధ పంటలను పరిశీలించి ఆయా గ్రామాల్లో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునే ఆముదం, అలసంద, ఉలవ, పెసర తదితర పంటలను సాగు చేయాలన్నారు. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలను ఆర్‌ఎస్‌కే సిబ్బందితో నమోదు చేయించాలన్నారు. వాతావరణ బీమా ఈ నెల 15 వరకూ ఉన్నందున ప్రతి రైతూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రీమియాన్ని సీఎస్‌పీ సెంటర్లలో చెల్లించాలన్నారు. వేరుశనగ, కందికి బెట్ట తగలకుండా పొటాషియం నైట్రేట్‌ 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. సాళ్ల మధ్యలో కలుపు లేకుండా చూసుకోవాలన్నారు. నీటి సదుపాయం ఉంటే ఒక తడిని ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏఈఓ ఆనంద్‌ నాయక్‌, వ్యవసాయ కళాశాలల ప్రిన్సిపాళ్లు రవికుమార్‌, పీటర్‌, ఆర్‌ఎస్‌కే సిబ్బంది వేమారెడ్డి, చంపకలక్ష్మి, సొసైటీ అధ్యక్షుడు శ్రీరామరెడ్డి తదితరులు ఉన్నారు.

కదిరి టౌన్‌: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన ఉమామహేశ్వర ఆలయం(శివాలయం)లో వర్షాల కోసం సోమవారం అర్చకులు మహాయాగం నిర్వహించారు. ఖాద్రీ ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, ప్రధాన అర్చకుల నేతృత్వంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు చేపట్టారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

యువతి అదృశ్యం

పెనుకొండ రూరల్‌: మండలంలోని గుట్టూరు గ్రామానికి చెందిన ఓ యువతి అదృశ్యమైంది. కియా పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన దేవరాజు కుమార్తె ఆదివారం అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయింది. పరిసర ప్రాంతాలు, బంధువుల వద్ద ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డి. రాఘవయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement