● కుమారుడి పరిస్థితి చెబుతూ
కన్నీటి పర్యంతమైన మహిళ
పుట్టపర్తి అర్బన్: ‘‘నా కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నుపూస దెబ్బతినడంతో రెండుకాళ్లూ కదపలేని స్థితి ఉన్నాడు. రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. అయినా పింఛన్ ఇవ్వరా’’ అంటూ ఓ మహిళ తన కుమారుడిని ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు ఆటోలో తీసుకువచ్చి మరీ అధికారులను ప్రశ్నించింది. వివరాల్లోకి వెళితే..బుక్కపట్నంకు చెందిన ఓబుళపతి, నారాయణమ్మ దంపతుల కుమారుడు సురేష్ డిగ్రీ వరకూ చదువుకున్నాడు. భార్య చందన, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణకు సురేష్ కొత్తచెరువులోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా చేరాడు. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సురేష్‌కు వెన్నుపూస దెబ్బతినింది. కుమారుడి చికిత్స కోసం ఆ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న బంగారు, కొద్ది పాటి భూమిని అమ్మారు. అయినా అతని పరిస్థితిలో మార్పు రాలేదు. శరీరం సహకరించక పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. కనీసం పింఛన్ అయినా ఇచ్చి ఆదుకోండని సురేష్ తల్లి నారాయణమ్మ అధికారులను వేడుకుంది. అయినా ఎవరూ కనికరించలేదు. ఒక సారి సదరం నిమిత్తం మదనపల్లికి పంపారు. అక్కడి వరకూ వెళ్లి వచ్చినా పింఛన్ మంజూరు చేయలేదు. దీంతో నారాయణమ్మ సోమవారం తన కుమారుడు సురేష్‌ను ఆటోలో వేసుకుని నేరుగా రెవెన్యూ భవన్‌కు వచ్చి కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కు చూపించి పింఛన్ మంజూరు చేయాలని వేడుకుంది. వెంటనే డీసీహెచ్‌ఎస్ మధుసూదన్ వచ్చి వివరాలు సేకరించారు.


