పుట్టపర్తి అర్బన్: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చేపట్టిన సమగ్ర రీ సర్వే అపహాస్యమైంది. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు లక్ష్యం పూర్తిగా గాడి తప్పింది. భూ సమస్యలు తీర్చేందుకు చేపట్టిన ప్రాజెక్టు రైతులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక రీసర్వే అంతా తూతూ మంత్రంగా మారింది. రైతులకు తెలియకుండానే సర్వే పూర్తి చేసిన అధికారులు భూ విస్తీర్ణం ఇష్టానుసారం నమోదు చేశారు. దీంతో క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి, పాసుపుస్తకంలో నమోదైన భూమికి పొంతన ఉండటం లేదు. దీంతో రుణాలతో పాటు ఇతర పథకాలకూ రైతులు దూరమవుతున్నారు.
మా తప్పేం లేదు..
పాసుపుస్తకంలో భూ విస్తీర్ణం తప్పుగా నమోదైందని, మార్చి ఇవ్వాలని రైతులు వీఆర్‌ఓలను కోరితే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలని చెబుతున్నారు. అక్కడికి వెళితే అదంతా సర్వే శాఖ చేసిన తప్పిదమని తమ తప్పేంలేదని చెబుతున్నారు. గట్టిగా నిలదీస్తే కలెక్టరేట్‌కు వెళ్లమని రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు చివరకు ఆందోళనకు దిగుతున్నారు.
రెవెన్యూ భవన్ ముట్టడి..
పుట్టపర్తి నియోజకవర్గంలో జరిగిన రీ సర్వేలు తప్పులు జరిగాయని పలువురు రైతులు సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం జరుగుతున్న రెవెన్యూ భవన్‌ను ముట్టడించారు. నల్లమాడ మండలం వేళ్లమద్ది, గుట్టకింద తండా, కొత్తపల్లి, యర్రవంకపల్లి, తదితర గ్రామాలకు చెందిన రైతులు పదుల సంఖ్యలో విచ్చేశారు. తమకు తెలియకుండానే రీసర్వే చేసి పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారని, అందులో భూముల విస్తీర్ణం తగ్గించి చూపారని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీఆర్‌ఓలను, తహసీల్దార్లను అడిగినా సరైన సమాధానం లేక పోవడంతో కలెక్టర్ వద్దకు వచ్చినట్లు వెల్లడించారు. తాము తాతల కాలం నుంచి పట్టాభూములను సాగు చేసుకుంటూ పంటలను పండించుకుంటున్నామని, అయితే ఇటీవల జరిగిన రీ సర్వే అనంతరం వచ్చిన పాస్ పుస్తకాలలో తప్పులు జరిగినట్లు గుర్తించామన్నారు. తమ దగ్గర ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలకూ ప్రస్తుతం వచ్చిన పాస్ పుస్తకాలకు చాలా తేడాలున్నాయని తెలిపారు. తప్పులతడకగా ఉన్న పాస్ పుస్తకాలతో మ్యుటేషన్లు సైతం కాలేదన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే తమకు సంబంధం లేనట్లు అధికారులు చెప్తున్నారన్నారు. ఒక్కో రైతుకు సంబంధించి అర ఎకరా నుంచి 3 ఎకరాల వరకూ తగ్గించి పట్టాదారు పాసుపుస్తకాల్లో విస్తీర్ణం చూపారన్నారు. ఇప్పటికై నా తమ సమస్యను పరిష్కరించక పోతే జాతీయ ఎస్టీ కమిషన్ సహకారంతో ఢిల్లీకి వెళ్లి కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడతామన్నారు.
ఈ చిత్రంలోని రైతు పేరు రమణానాయక్. నల్లమాడ మండలం వేళ్లమద్ది స్వగ్రామం. అతనికి మూడు సర్వే నంబర్లలో 3.80 ఎకరాలు ఉంది. ఇది తాతలకాలం నాటి నుంచి వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి. కానీ ఇటీవల భూమిని సర్వే చేసిన అధికారులు పట్టాదారు పాసుపుస్తకంలో కేవలం 2.06 ఎకరాలు మాత్రం చూపారు. తక్కిన 1.74 ఎకరాల భూమిని మాయం చేశారు. ఇప్పటికే రమణానాయక్ పాసుపుస్తకాలు పెట్టి బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ఇటీవల రెన్యూవల్‌కు వెళ్తే వన్‌బీలో విస్తీర్ణం తగ్గడంతో బ్యాంక్ మేనేజర్ రుణం మొత్తం చెల్లించాలని చెప్పారు. తనకు 3.80 ఎకరాల భూమి ఉందని చెప్పినా వినిపించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
...రమణానాయక్ లాగే జిల్లాలో చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీసర్వే అనంతరం అధికారులు ఇష్టానుసారం భూవిస్తీర్ణం నమోదు చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఒక్కో రైతు పాసుపుస్తకం నుంచి 5 సెంట్లు, 10 సెంట్లు నుంచి ఎకరాలకు ఎకరాలే మాయం చేశారు. అడిగితే ప్రింట్ చేసిన చోట టెక్నికల్ ఇష్యూ వచ్చిందని, మళ్లీ పంపుతామని సర్ది చెప్తున్నారు.
అపహాస్యమవుతున్న రీ సర్వే ప్రాజెక్టు
పాసుపుస్తకంలో భూ విస్తీర్ణం
తగ్గించి చూపిన వైనం
వన్‌బీలు కూడా రాక పథకాలు
పొందలేకపోతున్న రైతులు
తహసీల్దార్ కార్యాలయాల్లో
సంప్రదించినా స్పందన శూన్యం
సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించిన గిరిజన రైతులు


