సాక్షి పుట్టపర్తి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ శంకర నారాయణను పెనుకొండ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకుల భూదందాలు, అక్రమాలు, అణచివేతలను నిరసిస్తూ సోమవారం ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల పేరుతో శంకరనారాయణను హౌస్ అరెస్టు చేశారు. సోమవారం ఉదయం సీఐ రాఘవన్ మాజీమంత్రి నివాసానికి చేరుకుని ఉరవకొండ నిరసన ర్యాలీకి అనుమతులు లేవని, అందువల్ల అక్కడకు వెళ్లేందుకు వీలు లేదంటూ ఇంట్లోనే నిర్బంధించారు. ఈ సందర్భంగా శంకరనారాయణ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో భయానక వాతావరణం కనిపిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై దౌర్జన్యాలు, దాడులు చేయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందన్నారు. కనీసం నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ఉరవకొండలో జరిగే శాంతియుత ర్యాలీని అనుమతుల పేరుతో నిలువరించారన్నారు. ఎక్కడికక్కడ వైఎస్సార్ సీసీ నాయకులను అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. ఈ దౌర్జన్యకాండను, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం అధ్యయనం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా అక్రమ అరెస్టులను ఆపకపోతే రాబోవు రోజుల్లో ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
పెనుకొండ రూరల్: మండల పరిధిలోని అమ్మవారిపల్లి గ్రామంలోని నరసింహ స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న ముళ్ల పొదల్లో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ఓ పసిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తోంది. ఆడుకునేందుకు అటుగా వెళ్లిన చిన్నారులు శిశువు ఏడ్పువిని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు అంగన్‌వాడీ సిబ్బందిని తీసుకుని అక్కడికి చేరుకుని పరిశీలించగా...నవజాత మగశిశువు కనిపించింది. దీంతో వారు శిశువును చేరదీసి గుట్టూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శిశువుకు చికిత్స అందించి పాలు పట్టారు. అనంతరం వైద్య పరీక్షలు నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శిశువు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అనంతపురంలోని జీజీహెచ్‌కు రెఫర్ చేయడంతో అంగన్‌వాడీ సూపర్ వైజర్ విజయలక్ష్మి శిశువును అక్కడికి తరలించారు. అయితే ఆ శిశువును వదిలివెళ్లిన వారు ఎవరు.. ఎందుకని ఇలా చేశారు...అన్న వివరాలు తెలియరాలేదు. అంగన్‌వాడీ సిబ్బంది సమాచారంతో కియా స్టేషన్ ఎస్‌ఐ రాఘవయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


