దగా డీఎస్సీపై ధర్మాగ్రహం | - | Sakshi
Sakshi News home page

దగా డీఎస్సీపై ధర్మాగ్రహం

Aug 4 2026 12:17 AM | Updated on Aug 4 2026 12:17 AM

సాక్షి, పుట్టపర్తి మెగా డీఎస్సీ పేరుతో ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అవకతవకలపై బాధిత అభ్యర్థుల తరఫున వైఎస్సార్‌ సీపీ పోరుబాట పట్టింది. అందులో భాగంగా ఆందోళనలను తీవ్రతరం చేసింది. సోమవారం పెనుకొండ, మడకశిర, ధర్మవరంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించింది. వైఎస్సార్‌ సీపీ నాయకులతో పాటు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, మేధావులు భారీ సంఖ్యలో పాల్గొని చంద్రబాబు సర్కార్‌ తీరును నిరసించారు. అర్హులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌ సీపీ చేసే ప్రతి పోరాటంలోనూ పాలుపంచుకుంటామన్నారు.

లోకేష్‌ రాజీనామా చేయాలి..

దగా డీఎస్సీ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ అన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవతవకలను నిరసిస్తూ ఉషశ్రీచరణ్‌ ఆధ్వర్యంలో పెనుకొండలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏళ్లుగా కష్టపడి చదివి పరీక్ష రాసిన వారికి చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఒక్కో పోస్టును రూ.లక్షలకు అమ్ముకుందని ఆరోపించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ చేయించాలని ఆమె డిమాండ్‌ చేశారు. విచారణ అనంతరం పరీక్షలో అర్హత సాధించిన వారందరికీ పోస్టింగులు ఇచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించకుండా చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తోందన్నారు. నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ తరహాలో డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదో మాయని మచ్చ : కేతిరెడ్డి

చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు చేసి అర్హులకు అన్యాయం చేసిందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ధర్మవరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రముఖులతో రౌండ్‌ టేబుల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ పోస్టులను కూటమి నేతలు అమ్ముకుని అర్హులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలన్నారు. డీఎస్సీలో జరిగిన కుంభకోణం రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చ అన్నారు. ఈనెల 6 నుంచి ధర్మవరంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు కేతిరెడ్డి వెల్లడించారు.

ఇది సాక్ష్యం కాదా?

ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియలో భాగమైన పురమ నవీన్‌ అనే అభ్యర్థికి సోషల్‌ స్టడీస్‌లో కృష్ణా జిల్లా టాపర్‌గా, జోన్‌–2లో ఆరో ర్యాంక్‌గా నిలవడం చూస్తే ప్రశ్నాపత్రాలు లీక్‌ అయినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. గతంలో స్పోర్ట్స్‌ కోటా 2 శాతం ఉండేదని, కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ తెచ్చి స్పోర్ట్స్‌ కోటాను 3 శాతానికి పెంచడంతో పాటు అభ్యర్థులకు రాత పరీక్షను ఎత్తి వేయడం అక్రమాలకు నిదర్శనం కాదా అని కేతిరెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఇచ్చిన స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లను అనర్హులకు కట్టబెట్టింది వాస్తవం కాదా ప్రశ్నించారు. ఆర్చరీలో జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడల్‌ సాధించిన దుర్గయ్యను ఇంటర్వ్యూలకు పిలిచి ఉద్యోగం ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని కేతిరెడ్డి ప్రశ్నించారు.

సీబీఐ విచారణ చేయాలి : ఈరలక్కప్ప

డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించి అభ్యర్థులకు న్యాయం చేయాలని మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప అన్నారు. మడకశిరలోని టౌన్‌ హాల్‌లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులు, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఆందోళనలో భాగంగా ఈనెల 6, 7, 8, 9 తేదీల్లో మడకశిరలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు

డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని నేతల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement