సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షణ కొరవడటంతో కార్యాలయాలకు కూడా సరిగా రావడం లేదు. ఎప్పుడైనా వచ్చినా... ‘‘వచ్చామా.. వెళ్లామా’’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులు తప్ప మిగతా ఎవరూ స్థానికంగా ఉండటం లేదు. సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తే వారు అందుబాటులో ఉండరు. ఫోన్ కాల్స్‌కు స్పందించరు. ఎవరైనా నేరుగా కార్యాలయానికే వెళ్లి ‘సార్’ ఎక్కడ అని ప్రశ్నిస్తే... ఆఫీసర్ ఫీల్డ్‌కు వెళ్లారని సిబ్బంది చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంది.
వారాంతపు దినాల్లో ఒక రోజు ముందుగానే అంటే శుక్ర లేదా శనివారాల్లో మధ్యాహ్నం 3 గంటలకే చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో సీట్లన్నీ ఖాళీ అవుతున్నాయి. పౌర సరఫరా, మున్సిపల్, రెవెన్యూ, మత్స్యశాఖ, పుడా, మార్కెటింగ్, పంచాయతీ, ఆర్ అండ్ బీ, విద్యా శాఖలో ఉన్నతాధికారులు కార్యాలయాల్లో సరిగా ఉండటం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. అదేవిధంగా ట్రెజరీ, వ్యవసాయ, హౌసింగ్ కార్యాలయాల్లో సిబ్బంది సమయపాలన పాటించలేదని జనమే చెబుతున్నారు. ఇక వైద్య, ఆరోగ్య శాఖలో ఎవరు ఏ విభాగంలో ఉంటారో అర్థం కాని పరిస్థితి. చాలామంది అనంతపురం నుంచి వచ్చి వెళ్తుండటంతో అవసరాల ఆధారంగా ఫీల్డ్ పేరుతో డుమ్మా కొడుతున్నారు. అనంతపురం నుంచి వచ్చే అధికారులంతా మధ్యాహ్నం 3 గంటల నుంచి రైలు కోసం వేచి చూస్తూ ఆఫీసు నుంచి ఆటో ఎక్కి టక్కున స్టేషన్‌కు వెళ్లిపోతున్నారు. మంగళ, గురు, శని వారాల్లో కొండవీడు రైలు ఉన్నందున మధ్యాహ్నం 3 గంటలకే సుమారు 100 మంది పైగా డ్యూటీ మధ్యలో వెళ్తున్నారు. పర్యవేక్షించే అధికారి అంతకంటే ముందే ఫీల్డ్‌కు వెళ్తున్న కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన ఇష్టారాజ్యంగా ఉంది.
‘ఫీల్డ్’ పేరుతో చాలా మంది అధికారులు కార్యాలయం నుంచి వెళుతూ..కింది స్థాయి వారికి బాధ్యతలు అప్పగించి వెళ్తున్నారు. అయితే ఇన్‌చార్జ్‌గా వ్యవహరించే అధికారి మాట ఎవరూ వినడం లేదు. వారం రోజుల క్రితం వైద్య, ఆరోగ్య శాఖలో అధికారి లేని సమయంలో సిబ్బంది తన్నుకున్నారు. సివిల్ సప్లై విభాగంలో అధికారులు ఆఫీసులో వారానికి ఓసారి కూడా కనిపించడం కష్టంగా మారింది. పుట్టపర్తి మండల రెవెన్యూ అధికారులు భూ సేకరణ పనులతో నిత్యం ఫీల్డ్‌లో ఉన్నామనే చెబుతున్నారు. కలెక్టరేట్‌లో కాన్ఫరెన్స్ పేరుతో మున్సిపల్ సిబ్బంది ఇంటికెళ్లిపోతున్నారు. ఉన్నతాధికారులతో మీటింగులు ఉన్న రోజుల్లో మాత్రమే ఆఫీసుల్లో కనిపిస్తున్నారు.
కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లేకపోవడంతో బయటి వ్యక్తుల ప్రమేయం ఎక్కువగా ఉంటోంది. కొందరు దళారీ అవతారమెత్తి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయిస్తామని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎవరికీ డబ్బు ఇవ్వకుంటే పనులు ముందుకు కదలవు. ట్రెజరీ, మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాల్లో దళారీల రాజ్యం నడుస్తోంది.
ప్రజలకు అందుబాటులో ఉండని అధికారులు
చాలా మంది ఇతర ప్రాంతాల నుంచే రాకపోకలు
మీటింగు ఉంటేనే ఆఫీసుకు.. లేదంటే ఎగనామం
గట్టిగా నిలదీస్తే..ఆఫీసర్ ఫీల్డ్‌కు వెళ్లారని సిబ్బంది కవరింగ్
ఇన్‌చార్జిలకు అప్పజెబుతూ..
దళారులదే రాజ్యం..
మూడు గంటలకే ప్యాకప్..


