ప్రశాంతి నిలయం: ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించిన సమయంలో ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్...అనంతరం జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వర్షాకాలంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కడైనా వ్యాధులు ప్రబలినా వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టి నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. ఈ ఏడాది ఎల్‌నినో పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాలు కొంతమేర బలహీన పడే అవకాశం ఉందన్నారు. అనావృష్టి పరిస్థితులు ఏర్పడినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కొండయ్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘నీట్’ అభ్యర్థులకు
ఉచిత ప్రయాణం
పుట్టపర్తి అర్బన్: ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, వెటర్నరీ తదితర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 21న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబులిటీ కవ్‌ు ఎంట్రెన్స్ టెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష కేంద్రం వరకూ ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందని డీపీటీఓ మధుసూదన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష రాసిన తర్వాత కూడా ఉచితంగానే స్వగ్రామాలు చేరుకోవచ్చన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను కండక్టర్‌కు చూపించి ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేరకు అన్ని ఆర్టీసీ డిపోల మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు డీపీటీఓ చెప్పారు.
నేడు నేమకల్లు అంజన్న ప్రతిష్టాపన
బొమ్మనహాళ్: నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయం జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో బాలాలయంలో శనివారం స్వామివారి ప్రతిష్టాపన జరగనుంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ నరసింహారెడ్డి, ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్ చార్యులు, ధర్మకర్త శ్రీనాథ్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని భోజనశాలలో శనివారం ఉదయం 7.37 గంటల నుంచి 11.17 గంటలకు బాలాలయాన్ని ఏర్పాటు చేసి, స్వామివారి మూలవిరాట్‌ను ప్రతిష్టిస్తున్నట్లు వారు వెల్లడించారు. అక్కడే నిత్య పూజలు, అర్చనలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నుట్లు వెల్లడించారు. ఆలయ జీర్ణోద్ధరణ పూర్తయ్యే వరకు భక్తులకు బాలాలయంలోనే స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు.


