సోలార్‌ కోసం మా కడుపులు కొట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ కోసం మా కడుపులు కొట్టొద్దు

Jun 19 2026 12:12 AM | Updated on Jun 19 2026 12:12 AM

ఎన్‌పీకుంట: అభివృద్ధి పేరుతో వ్యవసాయ యోగ్యమైన భూముల్లో సోలార్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణం చేపట్టి తమ కడుపులు కొట్టవద్దని మరికొమ్మదిన్ని పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల రైతులు తహసీల్దార్‌ లక్ష్మమ్మను వేడుకున్నారు. తమ గ్రామాల్లో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కోసం చేపట్టిన పనులు నిలిపి వేసి దశాబ్దాలుగా సాగులో ఉన్న తమ భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు రైతులంతా గురువారం మండల కేంద్రానికి చేరుకుని తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... మరికొమ్మదిన్ని పంచాయతీ పరిధిలో 100 మెగావాట్ల గ్రీన్‌ఎనర్జీ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసం డిజిటెక్‌ కంపెనీ ఆధ్వర్యంలో డ్రోన్‌ సర్వే పనులు ప్రారంభించారన్నారు. రైతులు, గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండా పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు. తమ తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూములను సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం తీసుకోవడం దారుణమన్నారు. గతంలో తమ సాగుభూములకు హద్దులు ఏర్పాటు చేసుకోవడానికి, పట్టాలు పొందడానికి సర్వే పేరుతో రూ.లక్షల్లో ముట్టజెప్పామని, అయినా రెవెన్యూ అధికారులు రేపు, మాపు అంటూ కాలయాపనచేసి తమకు పట్టాలు మంజూరు చేయలేదని వాపోయారు. పంచాయతీ పరిధిలో సుమారు 100 నుంచి 120 కుటుంబాలు పాడిపశువులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని, 10 వేల నుంచి 15 వేల వరకు మూగజీవాలు ఉన్నాయన్నారు. సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే మూగజీవాలకు మేత ఎక్కడ నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. రైతుల బతుకులను ప్రశ్నార్థం చేసే సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై అధికారులు పునరాలోచించాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంపై తహసీల్దార్‌ లక్ష్మమ్మ మాట్లాడుతూ.. సోలార్‌ ఏర్పాటు వల్ల రైతులకు ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ఆయా గ్రామాల్లో రైతులతో సభలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపడతామని, అందరూ ఒప్పుకుంటేనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ తిమ్మారెడ్డి, రైతులు తిరుమలనాయుడు, బుల్లెట్‌ బాబా, యాదళ్ల రాజేష్‌, రమణ, వెంకటనారాయణ, ఖాదర్‌వలి, మస్తాన్‌వలి, ఇమాంసా, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌ ఎదుట

కన్నీటిపర్యంతమైన రైతులు

సాగుభూములకు పట్టాలు ఇవ్వాలని వేడుకోలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement