పుట్టపర్తి అర్బన్: చంద్రబాబు పాలన ‘‘కట్టేది తక్కువ...కూల్చేది ఎక్కువ’’ అన్నట్లుగా సాగుతోంది. అభివృద్ధిని విస్మరించిన అధికారపార్టీ నేతలు.. గతంలో అభివృద్ధి పనులకు వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ రౌడీ పాలన ఎలా ఉంటుందో చూపుతున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు తదితర వాటిపై ఉన్న శిలాఫలకాలు ధ్వంసం చేశారు. తాజాగా...వైఎస్ జగన్ హయాంలో అభివృద్ధి పనులకు వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ పచ్చని పల్లెల్లో అలజడి సృష్టిస్తున్నారు.
జనం చీవాట్లు వినలేక..
పుట్టపర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి 193 చెరువులు నింపాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఒప్పించి అనుమతులు తెచ్చారు. అంతేకాకుండా రూ.864.18 కోట్ల నిధులు తెచ్చి 2024 జనవరి 27న పుట్టపర్తి మండలం చెర్లోపల్లి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అప్పట్లోనే రూ.కోట్ల విలువైన భారీ పైపులను చెర్లోపల్లి వద్దకు చేర్చారు. ఐరన్ పైపులకు సిమెంట్ పూత సైతం పూర్తయ్యింది. ఇక ప్రతి చెరువుకూ పైప్‌లైను వేసి నీళ్లు పారించడమే తరువాయి...సరిగ్గా అదే సమయంలో ఎన్నికలు రావడం...ప్రభుత్వం మారడంతో 193 చెరువులకు కృష్ణాజలాలు నింపే కార్యక్రమం ఆగిపోయింది. ప్రస్తుత ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి హామీ ఇచ్చినా... ఇప్పటి వరకూ చెరువులు నింపే కార్యక్రమంలో ఒక అడుగుకూడా ముందుకు పడలేదు. దీంతో పుట్టపర్తి–నల్లమాడ ప్రధాన రహదారిలో ఉన్న భారీ శిలాఫలకం చూస్తున్న జనం ‘‘శ్రీధర్‌రెడ్డి ఉంటే ఈ పాటికి అన్ని చెరువులకూ నీళ్లు వచ్చేవి...వీళ్లు పట్టించుకునేలా లేరు..వీళ్లకు దోచుకోవడం తప్ప..ప్రజలకు మంచి చేసే ఆలోచనే లేదు’’ అంటూ చీవాట్లు పెడుతున్నారు. దీన్ని సహించలేని కొందరు ఆదివారం రాత్రి 193 చెరువులకు కృష్ణా జలాలు మళ్లించే పథకానికి సంబంధించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ప్రాజెక్టును పూర్తి చేయలేని వారే ఇలా చేసి ఉంటారని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
విధ్వంసమే వారి పాలన
ఆది నుంచీ టీడీపీది విధ్వంస పాలనే. ఇప్పుడు శిలాఫలకాలను ధ్వంసం చేసినంత మాత్రాన చరిత్రను చెరిపి వేయలేరు. పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదు. శంకుస్థాపన శిలాఫలకాలు ధ్వంసం చేయడం రాజకీయ కక్షే. వారి కక్షసాధింపు ధోరణి ఈ ఘటనతో బయటపడింది. ఇది పిరికి పందల చర్య. ఇది అభివృద్ధిపై చేసిన దాడి మాత్రమే కాదు, రైతుల ఆశయాలపై చేసిన దాడి.
– దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
మంచి చేయలేక.. చేసింది చూడలేక
193 చెరువులకు నీరు నింపే పథకం
శిలాఫలకం ధ్వంసం


