అనంతపురం అగ్రికల్చర్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ప్రాంగణం చిత్తడి చిత్తడిగా మారింది. అసలే ఆదివారం పశువుల సంత కావడంతో పరిస్థితి ఘోరంగా తయారైంది. తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో యార్డు ప్రాంగణం రొచ్చు రొచ్చుగా మారింది. ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు గుంతలు చిన్నపాటి చెరువులను తలపించాయి. వర్షపునీరు, డ్రైనేజీ సజావుగా వెళ్లడానికి సరైన సదుపాయం లేకపోవడంతో సంతకు వచ్చిన పశువులు, ఎద్దులు, గేదెలతో పాటు రైతులు, వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వర్షపునీరుకు పేడ, మూత్రం తోడు కావడంతో ఆ ప్రాంతమంతా కంపు కొట్టింది. ముందు రోజు శనివారం కూడా జీవాల సంతలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సంతలో సమస్య లేకుండా చూడాల్సిన మార్కెట్‌యార్డు పాలకులు, అధికారులు, సిబ్బంది మాత్రం మార్కెట్ రుసుం వసూలు చేసుకుని నింపాదిగా వెళ్లిపోయారు.
నేడు డయల్ యువర్
ఎస్పీడీసీఎల్ సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు మొబైల్: 8977716661 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు.
రెడ్‌క్రాస్ చరిత్రలో రికార్డు
● వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా 756 యూనిట్ల రక్తదానం
● వైఎస్సార్‌సీపీ నేతలకు అవార్డులు
నార్పల: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చరిత్రలో నార్పల మండలం సరికొత్త రికార్డు సృష్టించింది. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డికి రాష్ట్రస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. గత ఏడాది డిసెంబర్ 21న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా నార్పలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగానే ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చరిత్రలోనే ఒక్కరోజులో అత్యధిక రక్తం సేకరించిన కేంద్రంగా రాష్ట్రంలోనే నార్పల ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. శైలజానాథ్, సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానంతో యువత, వైఎస్సార్‌సీపీ శ్రేణులు రికార్డుస్థాయిలో 752 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఏలూరులో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రస్థాయి అవార్డును మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌కు అందజేశారు. అలాగే అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రక్తదాతలు, యువత, పార్టీ శ్రేణులు, వైద్య సిబ్బందికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.


