అనంతపురం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై ఒకటో తేదీన బుక్కరాయసముద్రం మండలం జంతలూరు వద్ద గల సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీని సందర్శించనున్నారు. విజిటర్ హోదాలో ‘జ్ఞాన సీమ’ ప్రాంగణంలో జరగనున్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ తొలి స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. 2020లో ఉత్తీర్ణులైన తొలి బ్యాచ్ నుంచి 2026 బ్యాచ్ వరకు మొత్తం 1,200 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. అలాగే 61 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు హాజరు కానున్నారు. కార్యక్రమానికి హాజరై తమ పట్టాలను ప్రత్యక్షంగా స్వీకరించదలచిన అభ్యర్థులు మరిన్ని వివరాలు https://cuap.ac.inలో తెలుసుకోవచ్చు.
మహిళల రక్షణకే
‘ఆపరేషన్ దండయాన్’
ఓడీచెరువు: మహిళలు, చిన్నారుల భద్రతకు పోలీసుశాఖ తొలి ప్రాధాన్యతనిస్తుందని ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. శనివారం ఓడీచెరువులో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ దండయాన్’ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ సతీష్‌కుమార్... మహిళలు, బాలికల భద్రత గురించి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోక్సో చట్టం, ఆడపిల్లల రక్షణలో తల్లి పాత్ర, మహిళలపై లైంగిక దాడులు, చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలకు పడే శిక్షలు తదితర వాటి గురించి వివరించారు. లైంగిక నేరాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. మహిళల రక్షణకే ‘ఆపరేషన్ దండయాన్’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందు వాల్మీకి విగ్రహం వద్ద నుంచి వశిష్ట స్కూల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల
జాబితా విడుదల
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ప్రవేశాల జాబితా విడుదలైంది. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో 2026–27 విద్యాసంవత్సరం అడ్మిషన్లలో భాగంగా ఎంపికై న అభ్యర్థుల జాబితాను ఆర్జీయూకేటీ వర్గాలు శనివారం విడుదల చేశాయి. ప్రత్యేక కేటగిరీ కోటా మినహా 4,040 సీట్లకు విద్యార్థులను ఎంపిక చేసి జాబితా విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 366 మంది, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి 181 మంది ఎంపికయ్యారు. అనంతపురం జిల్లా నుంచి 149 మంది ఎంపికయ్యారు. విద్యార్థులకు ఈ నెల 19వ నుంచి 24తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.


