ఎన్‌పీకుంట: మండల పరిధిలోని ఎదురుదోన సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ చంద్రశేఖర్‌రెడ్డిని జిల్లా వెల్ఫేర్ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు డీఎల్‌డీఓ వెంకటరత్నం, ఎంపీడీఓ పార్థసారథి తెలిపారు. రూ.2.50 లక్షల సామాజిక పింఛన్ సొమ్మును తన సొంత అవసరాల కోసం వాడుకొని, తిరిగి చెల్లించకపోవడంతో అతనిని సరెండర్ చేసినట్లు పేర్కొన్నారు. విషయం బయటికి వచ్చిన తరువాత తను వాడుకున్న పింఛన్ సొమ్మును చలానా రూపంలో తిరిగి చెల్లించడానికి సమయం ఇచ్చినా నిర్లక్ష్యం వహించడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
గుత్తి రూరల్: వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండలంలోని తురకపల్లిలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రంగస్వామి మంగళవారం చిన్న పాటి విషయంపై ఇంట్లో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సలకు అనంతపురం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎద్దుల బండిని ఢీకొన్న టాటా ఏస్
తాడిపత్రి రూరల్: మండలంలోని పెద్దపొలమడ–చిన్నపోలమడ మార్గంలో మంగళవారం తెల్లవారుజామున ఎద్దుల బండిని టాటా ఏస్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. మండలంలోని బుగ్గకు చెందిన డ్రైవర్ వాసు, విజయ్ మహారాజ్‌లు పెద్దపప్పూరు మండలంలో జరిగిన చెక్క భజన కార్యక్రమానికి డీజే సామగ్రిని టాటా ఏస్‌లో తీసుకెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి బుగ్గకు వెళుతూ పెద్దపొలమడ–చిన్నపోలమడ రోడ్డులో ముందు వెళుతున్న ఎద్దుల బండిని ఢీకొన్నారు. ప్రమాదంలో ఎద్దుల బండి పూర్తిగా దెబ్బతింది. బండి నడుపుతున్న గంగాధర్, టాటా ఏస్‌లో డ్రైవర్ పక్కన కూర్చున్న విజయ్‌మహారాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయ్‌మహారాజ్ పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లారు. ప్రమాదంలో రెండు ఎద్దులకు కూడా గాయాలయ్యాయి. నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాదానికి కారణమైన టాటా ఏస్ మధ్యాహ్న సమయంలో కాలిపోవడం అను మానాలకు తావిచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


