గోరంట్ల: గోరంట్ల మండలంలో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. మంత్రి సవిత, ఎంపీ పార్థసారథి వర్గీయులు వేరు కుంపట్లు పెట్టుకుని ప్రతి విషయానికీ ఒత్తిడి చేస్తుండడంతో ఎవరి మాట వినాలో తెలియక అధికారులు నలిగిపోతున్నారు. మండలంలో అభివృద్ధి పనులు తమకు తెలియకుండా జరగడానికి వీలు లేదని అధికారులపై మంత్రి సవిత వర్గం అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతే స్థాయిలో ఎంపీ పార్థసారథి వర్గీయులు కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. తాము కూడా అధికార పార్టీకి చెందిన వారమేనని, అభివృద్ధి పనుల్లో తమకు సైతం భాగస్వామ్యం కల్పించాలని ఒత్తిడి తీసుకొస్తుండటంతో అధికారులు అయోమయంలో పడ్డారు. కూటమిలో భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, జనసేన నాయకులు సైతం తమకూ అవకాశం కల్పించాలని అధికారులపై ఒత్తిడి తెస్తుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రూపు రాజకీయాల కారణంగా మండలంలో అభివృద్ధి అటకెక్కిందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
వారపు సంత వేలంపాట రద్దుకు పావులు..
గోరంట్ల పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం రావికుంట చెరువు ప్రాంగణంలో సంత నడుస్తుంది. వారపు సంతలో దుకాణదారుల నుంచి గుత్త వసూలు నిమిత్తం సంవత్సర కాలనికి వేలం పాట నిర్వహిస్తారు. ఈ నెల 3న వారపు సంతకు సంబంధించి గోరంట్ల పంచాయతీ కార్యాలయంలో వేలం పాట నిర్వహించగా.. ఎంపీ పార్థసారథి వర్గీయుడు పులచెట్లపల్లి అశ్వర్థరెడ్డి రూ.35.43 లక్షలకు పాట దక్కించుకున్నాడు. అయితే ఎంపీ వర్గీయుడు దక్కించుకున్న వేలం పాట రద్దు చేయాలంటూ మంత్రి సవిత వర్గీయులు పంచాయతీ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో వేలం పాట రద్దు చేయకూడదంటూ ఎంపీ పార్థసారథి సైతం నేరుగా జిల్లా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
● గోరంట్ల మండలంలో
తారస్థాయికి గ్రూపు రాజకీయాలు
● ఒత్తిడిలో నలిగిపోతున్న అధికారులు


