ఉత్సవాలకు భంగం కలిగితే ఊరుకోం
తాడిమర్రి/ఎన్‌పీకుంట: ‘శివరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా సాగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. డ్రోన్‌లతో ఆలయాల వద్ద నిఘా ఉంచాం. ఎవరైనా ఉత్సవాలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఎస్పీ సతీష్‌కుమార్ హెచ్చరించారు. శివరాత్రి పర్వదిన వేడుకల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శనివారం ఆయన తాడిమర్రి మండలం కాటికోటేశ్వర క్షేత్రం, ఎన్‌పీకుంట మండలంలోని తిమ్మమాంబ ఆలయాలను సందర్శించారు. ఆయా ఆలయాల పరిసరాలను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు స్వయంగా తెలుసుకున్నారు. ఆయా ఆలయాల వద్ద ఏర్పాట్లపై సిబ్బందితో సమీక్షించి, తగు సూచనలు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలతో దేవాలయాలు, పరిసర ప్రాంతాల్లో అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. గొడవలు, ఘర్షణలకు పాల్పడి ఉత్సవాల్లో ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అంతకుముందు ఎస్పీ సతీష్‌కుమార్ తిమ్మమ్మమర్రిమాను వద్ద వెలసిన తిమ్మమాంబ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి జాగరణ ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ వెంట ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్, కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి, కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, ముదిగుబ్బ రూరల్ సీఐ సునీత, ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్ సిబ్బంది పాల్గొన్నారు.
సమాజహిత కార్యక్రమాలకు
ప్రచారం కల్పించాలి..
బత్తలపల్లి: ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన పాత్రికేయులు సమాజహిత కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని ఎస్పీ సతీష్‌కుమార్ కోరారు. శనివారం రాత్రి ఆయన బత్తలపల్లి పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. డ్రగ్స్ వాడకంతో కలిగే అనర్థాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ వాడకం, ఈవ్ టీజింగ్ తదితర వాటిపై జనసంచారం ఉన్న ప్రాంతాల్లో, ప్రధాన కూడళ్లల్లో పోలీసు శాఖ ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. పాత్రికేయులు తమవంతు బాధ్యతతో పోలీసులు చేపట్టిన కార్యక్రమాలకు ప్రచారం కల్పించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని, అప్పుడే తమ లక్ష్యం నెరవేరుతుందన్నారు.
శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
పలు క్షేత్రాల్లో ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ సతీష్‌కుమార్
ఉత్సవాలకు భంగం కలిగితే ఊరుకోం


