హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రోద్బలంతోనే ఆయన పీఏల ఆదేశాల మేరకు టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేష్‌రెడ్డి అన్నారు. హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప, మాజీ ఎంపీ తలారి రంగయ్యతో కలిసి ఆయన ఆదివారం హిందూపురంలో టీడీపీ గూండాల చేతిలో ధ్వంసమైన వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. హిందూపురం నియోజకవర్గంలో భూ దందాలు ఎక్కువ అయ్యాయని, మద్యం ఏరులై పారుతోందని, అవినీతి అక్రమాలు వెలుగులోకి తెస్తున్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దీపికను చూసి ఓర్వలేక దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి నేతలు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తోన్న ఓ ఆడబిడ్డపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం పిరికిపంద చర్య అన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశాంతమైన హిందూపురాన్ని అశాంతి పురంగా మారుస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై జరిగిన దాడులకు నియోజకవర్గంలో పర్యటిస్తోన్న ఎమ్మెల్యే బాలకృష్ణ బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు ఫయాజ్ బాషా, రాష్ట్ర కార్యదర్శి మధుమతిరెడ్డి ఉన్నారు.
టీడీపీ డైరెక్షన్‌లోనే పోలీసులు
ఎవరైతే కక్ష కట్టి వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారో.. వారందరికీ త్వరలోనే గుణపాఠం చెబుతామని హిందూపురం సమన్వయకర్త టీఎన్ దీపిక హెచ్చరించారు. అధికార మదంతోనే దాడులు చేస్తున్నారని.. రేపు ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో టీడీపీ వాళ్ల ఊహకే వదిలేస్తున్నామన్నారు. ఆదివారం ఆమె టీడీపీ గూండాల చేతిలో ధ్వంసమైన వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కనకదాస, అంబేడ్కర్ చిత్రపటాలను పగలగొట్టిన దృశ్యాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఇంతటి క్రూరత్వం బహుశా దేశంలోనే ఎవ్వరూ చేసి ఉండరేమో అన్నారు. టీడీపీ నేతల డైరెక్షన్‌లోనే పోలీసు వ్యవస్థ ఉందని ఆరోపించారు.
దిగజారుడు రాజకీయమే
అంబేడ్కర్ చిత్రపటాన్ని కాలితో తన్ని.. పగలగొట్టి.. తిరిగి విగ్రహాల వద్ద ధర్నాకు దిగడం టీడీపీ నాయకుల నీచబుద్ధికి నిదర్శనమని మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన హిందూపురంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉండే హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ డైరెక్షన్‌లో దిగజారుడు రాజకీయానికి తెరలేపారని మండిపడ్డారు. దౌర్జన్యాలు, దాడులు చేస్తే ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
అశాంతి‘పురం’గా మారుస్తున్నారు


