శతజయంతి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రశాంతి నిలయం: సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శతజయంతి వేడుకలకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, భక్తులు రానుండడంతో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌తో ప్రభుత్వ యంత్రాంగం సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామన్నారు. ఈ నెల 19న ప్రధాని నరేంద్రమోదీ పుట్టపర్తికి రానున్నారని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్ర పతి రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, మాజీ ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, భద్రత, పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు, ట్రాఫిక్ మళ్లింపులు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. భక్తుల రాకపోకలకు 200కు పైగా బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సాయి ఆరామంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, టోల్ ఫ్రీ నంబర్ 18002335598 ద్వారా భక్తులు సహాయం పొందవచ్చని పేర్కొన్నారు. సత్యసాయి విమానాశ్రయంలో రెండు హెలిప్యాడ్లు ఏర్పాటు చేశామని, అదనంగా మరో రెండు హెలిప్యాడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సోమవారం నుంచి ఈ నెల 23 వరకు శిల్పారామంలో వివిధ కళా సంస్థల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
సరిహద్దులో నిలిచిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు
చిలమత్తూరు: కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద రాష్ట్ర సరిహద్దు 44వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం పదుల సంఖ్యలో ప్రైవేట్ బస్సులు నిలిచిపోయాయి. కర్ణాటకలో ఆలిండియా పర్మిట్లు చెల్లవంటూ ఆర్టీఓ అధికారులు ప్రైవేట్ బస్సులను సీజ్ చేస్తున్నారని సమాచారం అందడంతో హైదరాబాదు నుంచి వచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులన్నీ కొడికొండ చెక్‌పోస్టులో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు బెంగళూరు వెళ్లడానికి గంటలకొద్దీ ఎదురుచూసి క్యాబ్‌లు, ఆర్టీసీ బస్సులలో బయల్దేరారు. ట్యాక్సులు చెల్లించకుండా తమను ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులు ఇబ్బంది పెట్టారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


