భద్రత కట్టుదిట్టం
● ఢిల్లీలో పేలుళ్లతో పోలీసుల అప్రమత్తం
● జిల్లాలో పలుచోట్ల వాహనాల తనిఖీలు
పుట్టపర్తి టౌన్: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం పేలుళ్లు జరిగిన నేపథ్యంలో జిల్లా అంతటా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. చెక్ పోస్టులు, జాతీయ రహదారులు, దర్శనీయ ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. కొన్ని రోజుల క్రితం ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ధర్మవరంలో నూర్‌మహ్మద్ అనే యువకున్ని అరెస్ట్ చేశారు. అతని సెల్ ఫోన్‌లో లభించిన సమాచారం ఆధారంగా ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేపట్టారు. పుట్టపర్తిలో ఈ నెల 13 నుంచి సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు 12 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, వీవీఐపీ, వీఐపీలతో పాటు దేశవిదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంతి నిలయం, రైల్వేస్టేషన్, విమానాశ్రయం, బస్టాండ్‌లు, లాడ్జీలు, హోటళ్లతో పాటు వివిధ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టి.. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై దృష్టి సారించి రికార్డులు పరిశీలించారు. పాత నేరస్తులు, అపరిచిత వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు. సబ్ డివిజన్ల పరిధిలో పలువురికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఎక్కడైనా అపరిచిత వ్యక్తులు కనపడితే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సతీష్‌కుమార్ కోరారు.


