విద్య, వైద్యంపై చిత్తశుద్ధేదీ?
పుట్టపర్తి : విద్య, వైద్య రంగాలపై చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీసీ నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పుట్టపర్తిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం 9, 15, 16, 19, 20వ వార్డుల కార్యకర్తలతో ‘రచ్చబండ’, కోటి సంతకాల సేకరణ పోస్టర్లు, డిజిటల్ బుక్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రానికి 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరు చేయించారన్నారు. అందులో ఐదు కళాశాలలను అందుబాటులోకి తెచ్చారన్నారు. మిగిలినవి పూర్తి చేసి అందుబాటులోకి తేవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య విద్యను దూరం చేయడం కోసమే ప్రైవేటీకరణ జపాన్ని చేస్తోందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడలో చేపట్టే నిరసన పోరుకు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి అబ్జర్వర్ రఘునాథరెడ్డి, నరసారెడ్డి పట్టణ కన్వీనర్ రవినాయక్, కౌన్సిలర్లు పవన్‌కుమార్, అనిత, నాయకులు లింగాల భాస్కర్‌రెడ్డి, సోముశేఖర్‌రెడ్డి, శంకర్, విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట ధ్వజం


