దర్జాగా కబ్జా
కదిరి అర్బన్: అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కదిరి మండలంలో టీడీపీ నేతల భూదాహం కలకలం రేపింది. మండల పరిధిలోని సున్నపుగుట్ట తండాలో సర్వే నంబర్ 148–2లో 3.61 ఎకరాల ప్రభుత్వ గయాళు భూమి ఉంది. ఈ భూమిపై టీడీపీకి చెందిన గంగయ్య అనే వ్యక్తి కన్ను పడింది. గత మూడు రోజులుగా రాత్రి పూట హిటాచీ పెట్టి గుట్టను చదును చేయిస్తున్నాడు. ఈ భూమి బైపాస్‌కు సమీపంలో ఉండడంతో ఎకరం రూ.కోటి దాకా పలుకుతోంది. రూ.3 కోట్లకు పైగావిలువ చేసే ఈ భూమిలో ఈ నెల తొమ్మిదో తేదీన అక్రమంగా చదును చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. హిటాచీని తిప్పి పంపించారు.
తెర వెనుక మరో ‘పచ్చ’ నేత..
ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారంలో తెర వెనుక మొటుకుపల్లి పంచాయతీకి చెందిన ఓ టీడీపీ నేత హస్తం ఉన్నట్లు పలువురు బాహాటంగా చెపుతున్నారు. హిటాచీకి సంబంధించి బాడుగ సైతం అతనే ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెనకుండి అన్నీ నడిపిస్తున్నాడని ఆ పార్టీవారే చెప్పుకోవడం గమనార్హం.
అది ప్రభుత్వ భూమే..
కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ సున్నపుగుట్టతండాలోని సర్వే నంబర్ 148–2లోని 3.61 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వానిదే. గత ప్రభుత్వ హయాంలో ఓ టీడీపీ నాయకుడు ఈ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా చకచకా బోరు వేసి మొక్కలు సైతం నాటేశాడు. ఆ కబ్జాను అప్పటి తహసీల్దార్ సునీత అడ్డుకుని అక్కడ ‘ప్రభుత్వ భూమి’ అని బోర్డు పెట్టించిన విషయం తెలిసిందే.
గ్రీవెన్స్‌లో తహసీల్దార్‌కు ఫిర్యాదు..
సున్నపుగుట్టతండాలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని పలువురు గ్రామస్తులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. కబ్జాదారుల నుంచి భూమిని కాపాడి.. గ్రామ అవసరాలకు కేటాయించాలని కోరారు.
క్రిమినల్ కేసు పెడతాం
సర్వే నంబర్ 148–2లోని ప్రభుత్వ భూమిలోకి ఎవరైనా దౌర్జన్యంగా ప్రవేశిస్తే క్రిమినల్ కేసు పెడతాం. ఇకపై ఇలాంటి కబ్జాదారులను ఉపేక్షించం. ఎలాంటి రికార్డులు లేకుండా ప్రభుత్వ భూమిని చదును చేయడం చట్టరీత్యా నేరం. ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయిస్తాం.
– మురళీకృష్ణ, తహసీల్దార్, కదిరి
దర్జాగా కబ్జా


