కుష్టు వ్యాధిపై అపోహలు తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

కుష్టు వ్యాధిపై అపోహలు తొలగించాలి

Nov 11 2025 5:25 AM | Updated on Nov 11 2025 5:25 AM

కుష్ట

కుష్టు వ్యాధిపై అపోహలు తొలగించాలి

పుట్టపర్తి అర్బన్‌: కుష్టు వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను పూర్తిగా తొలగించి, వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి ఇంటింటి సర్వే విజయవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) మౌర్య భరద్వాజ్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 17 నుంచి 30 వరకు కుష్టు వ్యాధి గుర్తింపునకు చేపట్టే ఇంటింటి సర్వేకు సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్‌లో విడుదల చేశారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో జేసీ మాట్లాడుతూ కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరినీ సర్వేలో గుర్తించి సత్వరమే వైద్య సేవలు అందించాలన్నారు. కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్య సేవలు అందిస్తే ఆరు నెలల్లో పూర్తిగా నయమవుతుందన్నారు. పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ సువర్ణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫైరోజాబేగం, జిల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్‌ అనుపమ జేమ్స్‌, డీపీఎంఓ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు

‘మధ్యాహ్న’ పస్తులు

ఎంఈఓ తనిఖీలో వెలుగుచూసిన వైనం

కనగానపల్లి: గుంతపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులను నెల రోజులుగా పస్తులు పెట్టారు. ఈ విషయం ఎంఈఓ విచారణలో వెలుగుచూసింది. ప్రాథమిక పాఠశాలలో మొత్తం 12 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ రాజశేఖర్‌ అనే ఉపాధ్యాయుడు పని చేస్తున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు కొన్ని నెలలపాటు వంట తయారు చేసి విద్యార్థులకు వడ్డించేవారు. అయితే విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నందున గిట్టుబాటు కావడం లేదని వంట చేయడం లేదు. నెల రోజుల నుంచి విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి దూరమయ్యారు. అయితే ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయలేదు. పైగా ఆన్‌లైన్‌లో భోజనాలు పెడుతున్నట్టుగానే నమోదు చేస్తున్నారు. ఎవరైనా భోజనం గురించి అడిగితే.. బియ్యం, కోడిగుడ్లు ఇంటికి ఇస్తూ శాంతింపజేస్తున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎంఈఓ–2 శ్రీదేవి సోమవారం పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. మధ్యాహ్నం తర్వాత పాఠశాల కమిటీ చైర్మన్‌ అమరనాథ్‌తో కలసి విద్యార్థుల తల్లిదండ్రులను సమావేశ పరిచి.. భోజన సమస్యపై చర్చించారు. తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు గతంలోని ఏజన్సీ వారితో వెంటనే రాజీనామా చేయించి.. కొత్త ఏజెన్సీని ఎంపిక చేశారు.

విలేకరిపై దాడిచేసిన

టీడీపీ నేతపై కేసు

చిలమత్తూరు: రోడ్డు నాసిరకంగా వేశారని వార్త రాసిన ప్రజాశక్తి మండల విలేకరి శంకర్‌పై ఆదివారం విచక్షణారహితంగా దాడి చేసిన టీడీపీ నేత నాగరాజు యాదవ్‌, అతని కుమారుడు హరీష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై కేసు నమోదు కాకుండా హిందూపురం ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. అయితే ఘటన తీవ్రత దృష్ట్యా విలేకరిపై దాడిచేసిన ఇద్దరిపైనా బీఎన్‌ఎస్‌ 118(1), 126(2), 351(2) రెడ్‌ విత్‌ 3(5) సెక్షన్ల కింద ఎస్‌ఐ మునీర్‌ అహ్మద్‌ సోమవారం కేసు నమోదు చేశారు.

ఆంత్రాక్స్‌పై అప్రమత్తం

అనంతపురం అగ్రికల్చర్‌: ‘ఆంత్రాక్స్‌ అలజడి’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. తక్షణ చర్యలు చేపట్టారు. ఆంత్రాక్స్‌ పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో ఐదు కిలోమీటర్ల పరిధిలో అన్ని జీవాలకు ఐదు రోజుల్లో వ్యాక్సిన్లు వేయాలని ఆ శాఖ జేడీ డాక్టర్‌ జి.ప్రేమ్‌చంద్‌ ఆదేశాలు జారీ చేశారు. అందుకు సరిపడా వ్యాక్సిన్లు సరఫరా చేయాలని స్థానిక పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (ఏడీ డీఎల్‌) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.రవిబాబుకు ఆదేశాలు ఇచ్చారు. ‘సాక్షి’ కథనంపై ఆ శాఖ కమిషనరేట్‌తో పాటు కలెక్టరేట్‌ నుంచి కూడా వివరణ కోరడంతో పశుశాఖ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని మరింత అప్రమత్తం చేశారు.

కుష్టు వ్యాధిపై  అపోహలు తొలగించాలి1
1/1

కుష్టు వ్యాధిపై అపోహలు తొలగించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement