రామరాయల శాసనం గుర్తింపు
గోరంట్ల: శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అరవీటి రామరాయల కాలం నాటి శాసనం గోరంట్లలో బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను చరిత్ర పరిశోధకుడు మైనాస్వామి సోమవారం మీడియాకు వెల్లడించారు. పురాతన లక్ష్మీ మాధవరాయ దేవాలయ ముఖ మండపం దక్షిణ ద్వారం పక్కన తొమ్మిది అడుగుల పొడవు, మూడున్నర అడుగుల వెడల్పుతో తెలుగు అక్షరాలతో కూడిన దాన శాసనాన్ని గుర్తించానన్నారు. ఆలయంలో నిత్య పూజా కై ంకర్యాలు నిర్విఘ్నంగా జరగడం కోసం ఆత్రేయ గోత్రం సోమ వంశోద్భవుడైన మహా మండలేశ్వరుడు అరవీటి రామరాయలు శకవర్షం1481 సిద్ధార్థి సంవత్సరం (జ్యేష్ట బహుళ 5)లో దాన శాసనాన్ని రాయించాడని పేర్కొన్నారు. ఆంగ్ల సంవత్సర ప్రకారం 1559 జూన్‌లో గోరంట్ల పరిసరాల్లోని భూములను మాన్యంగా గుడికి దానం చేసినట్లు శాసనం తెలుపుతోందన్నారు. ‘శుభమస్తు, స్వస్తిశ్రీ జయభ్యుదయ, శాలివాహన శకవర్షంబులు 1481 అగునేటి సిద్దార్థి సంవత్సరం (జ్యేష్టబహుళ 5) శ్రీమన్మహారాజాధిరాజ రాజపరమేశ్వర వీరప్రతాప శ్రీవీరసదాశివ మహారాయలు విద్యానగరమందు రత్న సింహాసనారూఢుడై పృధ్వీరాజ్యం చేయుచుండగా’ అని శాసనం సాగుతుందన్నారు. శాసనం పై భాగంలో ఆంజనేయస్వామి శిల్పం నమస్కార ముద్రలో సుందరంగా ఉందన్నారు. తుళవ సదాశివ దేవ మహారాయలును రాజుగా ఉంచి, బందీచేసి.. అరవీటి రాయలు అన్నీ తానై రాజ్యాధికారం చలాయించేవాడని గోరంట్ల మాధవరాయ దేవాలయంలోని శాసనంతో పాటు పలు శాసనాలు చెబుతున్నాయన్నారు. నామమాత్రపు రాజును రాజాధిరాజు శ్రీసదాశివ దేవ మహారాయలు అరవీటి రామరాయలు ఆత్రేయ గోత్రాన్ని విజయనగరాన్ని (నేటి హంపి) విద్యానగరంగా, గోరంట్లను మాత్రం గోరంట్ల అని శాసనం స్పష్టం చేస్తుందని వివరించారు.


