నేతన్న దినోత్సవం సాక్షిగా కూటమి ప్రభుత్వం చేనేత కార్మిక
● నేతన్న దినోత్సవం సాక్షిగా మూడు హామీలు
● చేనేతలకు 200, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
● జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తుందని, నేతన్న భరోసా సాయం అందిస్తామని ప్రకటన
● ఏ ఒక్కటీ అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న కూటమి సర్కార్
ధర్మవరం: జిల్లాలో చేనేత కేంద్రాలైన ధర్మవరం, గోరంట్ల, పుట్టపర్తి, ఉరవకొండ, సోమందేపల్లి, హిందూపురం ప్రాంతాల్లో దాదాపు 40 వేల చేనేత మగ్గాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా చేనేత రంగంపై ఆధారపడి 1.20లక్షల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. అయితే కొంత కాలంగా ముడిపట్టు ధరలు (రేషం, వార్డు, జరీ) రెట్టింపు స్థాయిలో పెరిగాయి. దీనికి తోడు విద్యుత్ చార్జీలు, అదనపు చార్జీల పేరుతో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పెంచేసింది. వీటన్నింటికి తోడు జీఎస్టీ పన్నుపోటు కూడా చేనేతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వెరసి రోజంతా కష్టపడి పని చేసినప్పటికీ కార్మికులకు రోజుకూలి కూడా రాని పరిస్థితి ఏర్పడింది.
హామీలు అంతేనా..?
ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన కూటమి ప్రభుత్వం చేనేత దినోత్సవం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మూడు ప్రధాన హామీలు అమలు చేస్తామని ప్రకటించారు. ఇందులో ప్రధానమైనది చేనేత మగ్గాల కార్మికులకు 200 యూనిట్ల దాకా, మరమగ్గాలకు 500 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు జీఓ 44 విడుదల చేసినా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న 100 యూనిట్ల ఉచిత విద్యుత్ మాత్రమే చేనేతలకు అందుతోంది. దీంతో వంద యూనిట్లు దాటిన చేనేత కార్మికులు అదనపు బిల్లులు చెల్లించే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా చేనేత కార్మికులు గాలి, వెలుతురు ఉంటేనే పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో విద్యుత్ వాడకం అధికంగా ఉంటుంది. కానీ చంద్రబాబు హామీ అమలు కాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో చేనేతలు పడ్డారు.
జాడలేని నేతన్న భరోసా.. జీఎస్టీ ఉపశమనం
‘నేతన్న భరోసా’ కింద చేనేత కార్మికులకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు సత్వరం అందిస్తామని చెప్పారు. ఆ హామీ కూడా ఇంత వరకు అమలు కాలేదు. కనీసం ప్రభుత్వం తరపున ప్రతిపాదనలు కూడా తీసుకోకపోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వం వచ్చిన యేడాదిన్నర కాలంలో గతంలో ఉన్న ముడిపట్టు ధరలకు.. ప్రస్తుతం ఉన్న ధరలకు తేడా ఉంది. ఏడాదిన్నర క్రితం ముడిపట్టు వార్పు (నిలువుపోగు) రూ.4 వేలు, రేషం కిలో రూ.3,500 ఉండగా.. ప్రస్తుతం వార్పు కిలో రూ.6 వేలు, రేషం కిలో రూ.5,800కు పెరిగాయి. ఇందుకు అనుగుణంగా పట్టుచీరల ధరలు పెరగకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ‘నేతన్న నేస్తం’ పథకం కింద ఏడాదికి రూ.24 వేలు ఒక్కో చేనేత కుటుంబానికి అందింది. ఈ డబ్బుతో మగ్గాన్ని ఆధునీకరించుకుని మెరుగైన సంపాదనను కార్మికులు పొందేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
● చేనేత కార్మికులకు జీఎస్టీ భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తుందని, అదీ చేనేత దినోత్సవం నుంచే అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆర్భాటపు ప్రకటనలు గుప్పించి చేనేతలకు ఆశ కల్పించడం, ఆపై అమలు చేయకపోవడం దారుణమని చేనేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేతన్న దినోత్సవం సాక్షిగా కూటమి ప్రభుత్వం చేనేత కార్మిక


