కాశీబుగ్గ ఘటన బాధాకరం
పుట్టపర్తి టౌన్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లి తొక్కిసలాటలో తొమ్మిది భక్తులు మరణించిన ఘటన బాధాకరమని వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. మరణించిన భక్తుల ఆత్మకు శాంతి కలగాలని ఆదివారం పుట్టపర్తిలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి గణేష్ కూడలి వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి పాలనలో భక్తులకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. మొన్న తిరుపతి, నిన్న సింహాచలం, నేడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. కార్తీక శనివారం ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసినా కాశీబుగ్గ క్షేత్రంలో ముందస్తు ఏర్పాటు చేయకపోవడంలో నిర్వాహకుల వైఫల్యం, ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికై నా దేవాలయాల్లో భక్తుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మరణించిన భక్తులకు సంబంధించి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సాయిలీల, మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, వైస్ చైర్మన్ తిప్పన్న, జిల్లా అధికారి ప్రతికారప్రతినిధి ఫొటో సాయి, పట్టణ కన్వీనర్ రవినాయక్, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి, కౌన్సిలర్ చెరువు భాస్కర్‌రెడ్డి, ప్రచార కమిటీ సభ్యులు గోపాల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు నారాయణరెడ్డి, ఈశ్వరప్ప, రాంజీనాయక్, నాయకులు నరసింహులు, ఈశ్వర్‌రెడ్డి, దాసిరెడ్డి, నరసింహులు, రామయ్య, సత్యనారాయణ, నారపరెడ్డి, మారెప్ప, తదితరులు పాల్గొన్నారు.


