హామీ వక్కలైంది
మడకశిర: జిల్లాలో వక్కతోటలకు మడకశిర నియోజకవర్గం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ అధిక విస్తీర్ణంలో వక్క ఉత్పత్తి అవుతోంది. అయితే స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో కర్ణాటకపై ఆధారపడాల్సి వస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే అమరాపురం కేంద్రంగా వక్క మార్కెట్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో నాయకులు ఇచ్చిన హామీ ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. దళారుల బెడద, రవాణా వ్యయప్రయాసల కారణంగా రైతుల ఆదాయానికి గండిపడుతోంది. జిల్లా వ్యాప్తంగా 2,500 హెక్టార్ల విస్తీర్ణంలో వక్క తోటలు విస్తరించాయి. ఇందులో ఒక్క మడకశిర నియోజకవర్గంలోనే రెండు వేల హెక్టార్లలో సాగవడం గమనార్హం. వక్క రైతులు దాదాపు 9,500 ఉన్నారు. మడకశిర నియోజకవర్గానికి ఆనుకుని పొరుగు రాష్ట్రం కర్ణాటకలో శిర, పావగడ, హిరియూరు, చిత్రదుర్గ, మధుగిరి, చిక్కనాయకనహళ్లి నియోజకవర్గాల్లోనూ వక్క తోటలు అధికంగా ఉన్నాయి. అక్కడి వక్క రైతులకు కర్ణాటక ప్రభుత్వం భీమసంద్ర, సాగర్, చెన్నగిరి, దావణగెరె, శిరలో మార్కెట్లు ఏర్పాటు చేసింది. మన రాష్ట్రంలో మడకశిర నియోజకవర్గంలో అధికంగా ఉన్న వక్క రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది.
ధర ఉన్నా మార్కెటింగ్ నిల్
ఈ ఏడాది వక్కకు ధర బాగుంది. దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో పాటు గతంలో ఎన్నడూ లేనివిధంగా మంచి ధర పలుకుతుండడంతో వక్క రైతులు ఆనందంగా ఉన్నారు. ఎండు వక్క ధర క్వింటాలు రూ.62 వేల వరకు, పచ్చి వక్క క్వింటాలు రూ.8,500 వరకు పలుకుతోంది. ఈ ఏడాది జిల్లాలో ఉత్పత్తి అయ్యే వక్క విలువ రూ.25 కోట్ల వరకు ఉంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అయితే స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడం రైతులను ఇబ్బంది పెడుతోంది. కర్ణాటకలోని మార్కెట్లకు వక్క తీసుకెళ్లి విక్రయించడం కాస్త ఖర్చుతో కూడుకున్న పని. అదే స్థానికంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉండి ఉంటే వ్యయప్రయాసలు తగ్గడంతో పాటు దళారుల బెడద లేకుండా పూర్తిస్థాయిలో ఆదాయం పొందే వీలుండేదని రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు కొలువుదీరి 17 నెలలైనా అమరాపురంలో వక్క మార్కెటింగ్ ఏర్పాటుపై దృష్టి సారించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. స్థానిక మార్కెట్ ఆవశ్యకతను ఇకనైనా గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఎండు వక్క
కాయల నుంచి వక్కను వేరు చేస్తున్న దృశ్యం
అమరాపురంలో వక్క మార్కెట్ ఏర్పాటు చేస్తామన్న కూటమి నేతలు
17 నెలలైనా హామీ అమలు గురించి పట్టించుకోని సర్కారు
కర్ణాటక మార్కెట్లపై ఆధారపడుతున్న జిల్లాలోని వక్క రైతులు
మార్కెట్ ఏర్పాటు చేయాలి
వక్క మార్కెట్ స్థానికంగా లేక ఇబ్బందులు పడుతున్నాం. కర్ణాటకలోని మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో వ్యయప్రయాసలు భరించాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని స్థానికంగానే మార్కెట్ సౌకర్యం కల్పించి రైతులను ఆదుకోవాలి.
– ప్రకాశ్, రైతు,
తమడేపల్లి, అమరాపురం మండలం
మాట నిలబెట్టుకోవాలి
తమను గెలిస్తే అమరాపురంలో వక్క మార్కెట్ ఏర్పాటు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 17 నెలలు గడిచింది. ఇంతవరకు వక్క మార్కెట్ మాత్రం ఏర్పాటు కాలేదు. ప్రారంభంలో హడావుడి చేసి గాలికొదిలేశారు. వక్క మార్కెట్ ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకోవాలి.
– వీరక్యాతప్ప, రైతు,
గౌడనకుంట, అమరాపురం మండలం
హామీలు నెరవేర్చడంలో విఫలం
మడకశిర నియోజకవర్గ అభివృద్ధికి కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చారు. గెలిచిన తర్వాత హామీల అమలులో విఫలమయ్యారు. అమరాపురం కేంద్రంగా వక్క మార్కెట్ ఏర్పాటు చేస్తామన్న హామీ మాటలకే పరిమితమైపోయింది. కృష్ణా జలాలను అన్ని చెరువులకూ తీసుకురావడంలో వెనకబడ్డారు.
– ఈరలక్కప్ప,
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మడకశిర
హామీ వక్కలైంది
హామీ వక్కలైంది
హామీ వక్కలైంది
హామీ వక్కలైంది


