డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే జోగి రమేష్ అరెస్టు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
పెనుకొండ రూరల్:
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్టు చేయించిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు సర్కారు వైఫల్యంతోనే శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. కొన్నిరోజుల క్రితం సింహాచలం, తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన విషయాన్ని మరువకనే మళ్లీ ఇప్పుడు ఇలా జరగడం కలచివేస్తోందని పేర్కొన్నారు. ఇలా వరుస వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీసిందని ఆరోపించారు. అందులో భాగంగానే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌ను ఎలాంటి ఆధారాలూ లేకపోయినా పోలీసులు అరెస్టు చేశారన్నారు. నకలీ మద్యం తయారీ వ్యవహారంతో ఇప్పటికే కూటమి ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందన్నారు. ఆ విషయం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు యథావిధిగా డ్రామాలాడుతోందన్నారు. నకలీ మద్యం తయారీ మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరిగిందన్నారు. కార్యకర్తలకు ఆదాయవనరులుగా బెల్టుషాపులు నడుపుతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడంలో చూపిన శ్రద్ధ ఆలయాల్లో భక్తులకు భద్రత కల్పించడంలో ఎందుకు చూపడం లేదని నిలదీశారు.
జోగి రమేష్ అరెస్ట్ అక్రమం
సాక్షి పుట్టపర్తి: నకిలీ మద్యం కేసులో ఎటువంటి ఆధారాలూ లేకపోయినా మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్ట్ చెయ్యడం అక్రమమని వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ మాలగుండ్ల శంకరనారాయణ ఖండించారు. లేని మద్యం కేసులో జోగి రమేష్‌ను అరెస్ట్ చెయ్యడం, బీీసీలను రాజకీయంగా అణగదొక్కడంలో భాగమేనని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అడ్డగోలుగా జరగతున్న మద్యం విక్రయాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ నేతల ఫ్యాక్టరీల నుంచి వెలువడిన నకిలీ మద్యంపై ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలన్నారు. కక్షపూరితంగా బీసీలను అక్రమ అరెస్ట్‌లు చెయ్యడం సరికాదని కూటమి ప్రభుత్వానికి ఆయన హితవు పలికారు.
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పీజీఆర్‌ఎస్ మందిరంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కలెక్టరేట్‌కు రాకుండా ""me-e-k-oram.a p.g-o-v.i n'' ద్వారా కూడా ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవచ్చని సూచించారు.
మృత్యువులోనూ తోడుగా..
ఓడీచెరువు(అమడగూరు): జీవితాంతం కలిసి ఉంటామని పెళ్లినాడు చేసిన బాసలు.. మరణానంతరం కూడా కొనసాగించారు ఆ దంపతులు. గంటల వ్యవధిలో ఇద్దరూ ప్రాణాలు విడిచారు. వివరాలిలా ఉన్నాయి. అమడగూరు మండలం జౌకలకొత్తపల్లికి చెందిన దండు వెంకటరమణ(75), దండు చిన్నపాపమ్మ (68) దంపతులు. వీరికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు సంతానం. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వయోభారంతో వెంకటరమణ శనివారం రాత్రి చనిపోయాడు. భర్త మరణంతో మనోవేదనకు గురైన చిన్నపాపమ్మ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. వీరి అన్యోన్య దాంపత్యం మృత్యువులోనూ వీడని బంధంగా నిలిచింది. తల్లి, తండ్రి గంటల వ్యవధిలోనే మరణించడంతో కుమారులు, కుమార్తెలు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అమడగూరు మండల కన్వీనర్ జయప్ప, ఎంపీటీసీ నాగరాజు గ్రామానికి వెళ్లి మృతులకు నివాళులర్పించారు. అదేరోజు అంత్య క్రియలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు.
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే జోగి రమేష్ అరెస్టు
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే జోగి రమేష్ అరెస్టు


