నిధుల దోపిడీకి ‘పచ్చ’ కుట్ర
చిలమత్తూరు: అభివృద్ధి పనుల ముసుగులో నిధుల దోపిడీకి అధికార ‘పచ్చ’ పార్టీ నేతలు కుట్ర పన్నారు. ఇందుకు మున్సిపల్ కమిషనర్ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ రూ.92 కోట్లు మంజూరు చేయించారని టీడీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. అనంతరం పట్టణ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ అధికారులు ఇటీవల టెండర్లు పిలిచారు. దరఖాస్తు గడువు పూర్తయ్యి.. టెండర్ బిడ్ తెరిచారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మున్సిపల్ కమిషనర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. రూ.2 కోట్లకు మించిన టెండర్లను రద్దు చేసే అధికారం కౌన్సిల్‌కు కూడా లేదు. ఈఎన్‌సీ అనుమతి తీసుకునే టెండర్ల ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే కమిషనర్ ఏకంగా రూ.92 కోట్లకు సంబంధించిన టెండర్లను స్వయంగా రద్దు పరచి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ముఖ్య ప్రజాప్రతినిధికి లబ్ధి చేకూర్చేందుకేనా?
హిందూపురం పట్టణ అభివృద్ది కోసం రూ.92 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించారు. తొలుత వేసిన టెండర్లు నిబంధనల ప్రకారమే ఉన్నాయి. అయితే టెండర్లు తక్కువకు కోట్ చేశారన్న విషయం తెలుసుకున్న ముఖ్య ప్రజాప్రతినిధి.. తమకు ఆదాయం లేకపోతే ఎలా? ప్రశ్నించినట్లు తెలిసింది. ఐదు శాతం అదనంగా టెండర్లు వేసేలా చూడాలన్న ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిబంధనలను అతిక్రమించి మరీ తొలుత వేసిన టెండర్లను రద్దుపరిచారు. తర్వాత మళ్లీ ఈ –ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు వేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఇదే అంశంపై మున్సిపల్ కమిషనర్‌ను వివరణ కోసం సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కమీషన్ల కోసం అడ్డదారుల్లో టెండర్లు నిర్వహించడం.. పచ్చ పార్టీ నేతల ధన దాహానికి అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
రూ.92 కోట్ల పనుల టెండర్ల ప్రక్రియ బిడ్ తర్వాత రద్దు
ఈఎన్‌సీ అనుమతి పొందకనే రద్దు పరచిన కమిషనర్
మళ్లీ 5 శాతం ఎక్సెస్‌కు టెండర్లు వేసుకునేందుకు అవకాశం


