కారును ఢీకొన్న లారీ
● నలుగురికి తీవ్ర గాయాలు
కనగానపల్లి: మండలంలోని ముక్తాపురం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఓ కారును సిమెంట్ లారీ ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... బెంగళూరుకు చెందిన వినయ్, సచిన్, అనిల్, గురు.. శనివారం మంత్రాలయానికి వెళ్లి మొక్కు చెల్లించుకున్నారు. ఆదివారం వారు తిరుగు ప్రయాణమయ్యారు. ముక్తాపురం వద్దకు చేరుకోగానే ఎదురుగా రాంగ్ రూట్‌లో ప్రవేశించిన సిమెంట్ లారీ ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను 108 వాహనం ద్వారా అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.


