లైంగిక వేధింపులపై మహిళాగ్రహం | - | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులపై మహిళాగ్రహం

Jul 30 2025 7:06 AM | Updated on Jul 30 2025 7:06 AM

లైంగి

లైంగిక వేధింపులపై మహిళాగ్రహం

చిలమత్తూరు: అధికార అండతో టీడీపీ నేతలు చేస్తున్న దాష్టీకాలపై మహిళాలోకం కన్నెర్ర చేసింది. బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో టీడీపీ నేత యుగంధర్‌ అలియాస్‌ చింటు లైంగిక వేధింపులపై మహిళాగ్రహం పెల్లుబుకింది. మంగళవారం వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపిక ఆధ్వర్యంలో బాధితురాలితో కలిసి మహిళలంతా రోడ్డెక్కారు. పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో వందలాది మంది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, మహిళలు, మైనార్టీలు బాధిత మహిళతో కలిసి భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి ధర్నా నిర్వహించారు. చింటు, అతని అనుచరులను అరెస్ట్‌ చేయాలని నినదించారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, హోంమంత్రి అనిత, సీఐ రాజగోపాల్‌నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఎన్‌ దీపిక, పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మధుమతిరెడ్డిపై మహిళా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ధర్నా చేయకూడదంటూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, మహిళలు ఎదురు తిరగడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ చేపట్టారు.

పని అడిగితే కమిటెమెంట్‌ అడుగుతారా..?

ర్యాలీ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపిక మాట్లాడారు. నియోజకవర్గంలో మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించడం, తిరిగి పని అడిగిన వారిని కమిట్‌మెంట్‌ అడగడం ఎంత దుర్మార్గమన్నారు. మహిళలను లైంగికంగా వేధిస్తున్న టీడీపీ నేతలను ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన పీఏలు ప్రోత్సహిస్తున్నారా... అని ఆమె ప్రశ్నించారు. హిందూపురంలో ఎమ్మెల్యే సతీమణి వసుంధర పర్యటిస్తే మహిళలను వేధించిన చింటుతో ఆమెకు బొకే ఇప్పించడం చూస్తే అతనికి ఇచ్చిన ప్రాధాన్యం తెలుస్తోందన్నారు. ఒక ఆడబిడ్డకు అన్యాయం చేస్తూ ఆమె బతుకు తెరువుపైకొట్టడం, ఆ మహిళను పక్కలోకి రమ్మంటూ నీచమైన ఆలోచనలు చేస్తున్న టీడీపీ నాయకులపై ఆ పార్టీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. బాధిత మైనార్టీ మహిళకు వైఎస్సార్‌ సీపీ తోడుగా ఉంటుందన్నారు. ఇక వన్‌ టౌన్‌ సీఐ రాజగోపాల్‌నాయుడు తీరు మార్చుకోవాలన్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళ పేరు, ఊరు ప్రస్తావిస్తూ ఆయన ఓ వీడియో రూపొందించి దాన్ని సోషియల్‌ మీడియాలో పెట్టడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. మహిళ భద్రత, రక్షణ అంశాలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా ఓ బాధ్యత కలిగిన పోలీసు అధికారి మాట్లాడటాన్ని ఆమె ఖండించారు. సీఐ తీరుపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

బాధితురాలికి న్యాయం చేయాలి

మహిళను లైంగికంగా వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మధుమతిరెడ్డి డిమాండ్‌ చేశారు. హిందూపురంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని, కనీసం మహిళలకు రక్షణ లేకుండా పోతోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ నేత వేణురెడ్డి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు కవితారెడ్డి, ఎంపీపీ రత్నమ్మ, పార్టీ కురుబ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌ఏ శివ, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అసిఫుల్లా, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బలరామిరెడ్డి, జెడ్పీటీసీ నాగభూషణం, వైఎస్సార్‌ సీపీ రూరల్‌ మండల కన్వీనర్‌ రాము, లేపాక్షి మండల కన్వీనర్‌ సయ్యద్‌ నిస్సార్‌, వైస్‌ ఎంపీపీ అంజన్‌రెడ్డి, సహేరాభాను, ఎంపీటీసీ ధనుంజయరెడ్డి, శబరీష్‌రెడ్డి, ప్రణయ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీరాములు, మైనార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

టీడీపీ నేత చింటు దుర్మార్గంపై మహిళల ధ్వజం

వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో పురంలో భారీ ర్యాలీ, ధర్నా

బాధితురాలితో కలిసి పాల్గొన్న

టీఎన్‌ దీపిక, మధుమతిరెడ్డి

చింటుపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌

లైంగిక వేధింపులపై మహిళాగ్రహం
1
1/1

లైంగిక వేధింపులపై మహిళాగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement