
యూరియా.. లేదయా!
పుట్టపర్తి అర్బన్: రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. సాగునీటి లభ్యత ఉన్న రైతులు ఖరీఫ్‌లో మొక్కజొన్న, వరి పంటలు సాగు చేశారు. ఈ రెండు పంటలకు యూరియా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇక ఇతర పంటలకూ రైతులు యూరియా వినియోగిస్తారు. సీజన్ ప్రారంభంలోనే పంటల సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసి రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోలేదు. దీనికి తోడు నానో యూరియా అంటూ బస్తాల్లో వచ్చే యూరియాను అందుబాటులో లేకుండా చేసింది. దీంతో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అంచనా తప్పిన అధికారులు
జిల్లాలో 6,640 హెక్టార్లలో మొక్కజొన్న, 276 హెక్టార్లలో వరి సాగు చేశారని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. క్రాప్ బుకింగ్ చేసే సిబ్బంది లేకపోవడంతో చాలా మంది రైతుల పంటలు రికార్డుల్లోకి ఎక్కలేదు. అందువల్ల సాగు విస్తీర్ణం అధికారుల లెక్కకు మించి ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా జిల్లాలో 6,396 హెక్టార్లలో వరి, 18 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగులోకి వస్తుంది. ఈ మేరకు అధికారులు ఎరువులు అందుబాటులో ఉంచాల్సి ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. ప్రజాప్రతినిధులు రైతుల గురించే ఆలోచించకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఫలితంగా జిల్లాలో యూరియా నిల్వలు నిండికుని రైతులకు కష్టాలు మొదలయ్యాయి.
ప్రైవేటు మార్కెట్‌లో అధిక ధరలు
ప్రస్తుతం జిల్లాలో యూరియా డిమాండును దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. 50 కిలోల యూరియా బస్తా ఎమ్మార్పీ రూ.267 ఉండగా... మార్కెట్‌లో రూ.300 నుంచి రూ.400 వరకూ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం అధిక ధర ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నా...స్టాకు లేదని చెబుతున్నారు. మొక్కజొన్న రైతులు ఫర్టిలైజర్ షాపులకు వెళ్తే కత్తెర పురుగుకు గుళికలు తీసుకోవాలని, వరి రైతులు వెళ్తే.. వరి పిలకలు వచ్చేందుకు ఎరువులు తీసుకోవాలని అవసరం లేని వాటినీ అంటగడుతున్నారు. వీటితో పాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇస్తాంటూ మెలిక పెడుతున్నారు. వీటిని తీసుకోని రైతులకు యూరియా లేదని వెనక్కు పంపుతున్నారు.
ఆర్‌ఎస్‌కేల్లో నో స్టాక్
రైతులను పిండుకుంటున్న ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు
యూరియా కోసం వెళితే డీఏపీ,
కాంప్లెక్స్ అంటగడుతున్న వైనం