
ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలి
● ఆర్టీసీ అధికారులకు
కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం
ధర్మవరం అర్బన్: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. మంగళవారం ఆయన ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ పరిసరాలతో పాటు టికెట్ కౌంటర్లు, సైకిల్‌స్టాండ్, తినుబండారాల దుకాణాలు, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సదుపాయం, గ్యారేజీలను పరిశీలించారు. బస్టాండ్‌ను మరింత పరిశుభ్రంగా ఉంచాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. తాగునీరు అందుబాటులో ఉంటోందా.. నిర్ణీత సమయానికి బస్సులు వస్తున్నాయా, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంటున్నాయా అంటూ ప్రయాణికులను ఆరా తీశారు. అనంతరం బస్సుల మైలేజీ గురించి అధికారులతో ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ సురేష్‌బాబు, ఆర్టీసీ డిపో ఇన్‌చార్జ్ సికిందర్, సమాచారశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
రైతుల సమక్షంలోనే
రీ సర్వే చేయాలి
ధర్మవరం రూరల్: రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ టీఎన్ చేతన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పోతులనాగేపల్లి గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు కుటుంబ సభ్యుల సమక్షంలోనే భూమిని రీ సర్వే చేయాలన్నారు. దీనివల్ల భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మహేష్, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్ సురేష్‌బాబు, రెవెన్యూ సిబ్బంది, రైతులు ఉన్నారు.