
హామీలతో నయవంచన
గోరంట్ల: సూపర్ సిక్స్ సహా 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా ప్రజలను నయవంచన చేస్తున్నారని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ఓట్లు వేయించుకుని.. అవసరం తీరాక హామీలను గాలికి వదిలేశారని విరుచుకుపడ్డారు. గోరంట్లలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ‘రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో– చంద్రబాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ పోస్టర్లను జిల్లా అధ్యక్షురాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువుదీరి ఏడాది దాటినా హామీలు సంపూర్ణంగా అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారని దుయ్యబట్టారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం ఇంతవరకూ అందలేదన్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా, ఉద్యోగాలు కల్పించకుండా.. నిరుద్యోగ భృతి చెల్లింకుండా యువతను దగా చేశారన్నారు. 18 ఏళ్లు నిండి 59 ఏళ్ల వయసు వరకు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని ఏడాది దాటినా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలను క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకు వివరించి, ఏ విధంగా మోసం చేశారో ప్రజలను చైతన్యవంతులను చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యకుడు రఘురామిరెడ్డి, పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పాలే జయరాంనాయక్, పట్టణ కన్వీనర్ మేదర శంకర, జిల్లా స్టీరింగ్ కమిటీ మాజీ సభ్యుడు గంపల వెంకటరమణారెడ్డి, ముఖ్యనాయకులు, బూదిలి రవీంద్రారెడ్డి, వానవోలు రాజేంద్రప్రసాద్, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజల్లోకి చంద్రబాబు మోసాలు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్