
‘వందే భారత్’కు అదనపు కోచ్‌లు
అనంతపురం సిటీ: ఈ నెల 10వ తేదీ నుంచి హైదరాబాద్–యశ్వంత్‌పూర్–హైదరాబాద్ మధ్య తిరిగే వందేభారత్ (20703/20704) రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ అశోక్‌కుమార్ మంగళవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎనిమిది కోచ్‌లతో నడుస్తుండగా.. అదనంగా మరో ఎనిమిది కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
16న మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
మడకశిర: మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ఈనెల 16న నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు నగర పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎన్నిక జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని ఉత్తర్వులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్ తెలిపారు. ఈ ఎన్నిక నోటిఫికేషన్‌ను ఈనెల 12న జారీ చేస్తారన్నారు. ఇదిలా ఉండగా ఇంతకు మునుపు మడకశిర నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్‌సీపీకి చెందిన లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్‌గా రామచంద్రారెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు. 20 మంది సభ్యులున్న మడకశిర నగర పంచాయతీలో 15 మంది వైఎస్సార్‌సీపీ తరుఫున గెలుపొందారు. కేవలం ఐదుగురు మాత్రమే టీడీపీ తరుఫున గెలుపొందారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలోకి చేర్పించుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లను పదవుల నుంచి దించారు. ఈ నేపథ్యంలో ఎన్నిక అనివార్యమైంది.
సీఎం పర్యటనకు
పకడ్బందీ ఏర్పాట్లు
కొత్తచెరువు: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీఎస్ చేతన్, ఎస్పీ రత్న, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ ఈ నెల 10న సీఎం చంద్రబాబు కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలల్లో నిర్వహించనున్న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా కార్యక్రమానికి హాజరవుతారన్నారు. కార్యక్రమానికి సంబంధించి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అందలేదని, అందిన వెంటనే తెలియజేస్తామన్నారు. ఎస్పీ రత్న మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో పక్కాగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్ డైవర్షన్లను చేశామని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి మరికొన్ని డైవర్షన్‌లు చేస్తామని వెల్లడించారు. కేవలం తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు.

‘వందే భారత్’కు అదనపు కోచ్‌లు