
1542 నాటి శాసనం లభ్యం
పావగడ: తాలూకాలోని పొన్న సముద్రం గ్రామం నుంచి బుడ్డారెడ్డి హళ్లికి వెళ్లే మార్గ మధ్యంలో ఓ పెద్ద బండపై కన్నడ లిపిలో చెక్కిన 9 వరుసల శిలా శాసనాన్ని స్థానిక చరిత్ర పరిశోధకుడు బీవీ రమేష్ బాబు మంగళవారం గుర్తించారు. శాసనానికి సంబంధించి అద్భుతంగా చెక్కిన సీ్త్ర పురుషుల చిత్రం ఉంది. క్రీ.శ. అక్టోబర్ 9, 1542లో శాసనం చెక్కినట్లుగా అందులో పేర్కొన్నారు. పొన్నసముద్రం కబిల అంగజోళ జక్కయ్యన మక్కళు నాగయ్య తదితర సహోదరుల ప్రతిష్ట జ్ఞాపకంగా ఈ శాసనం, శిల్పాలు చెక్కినట్లుగా అందులో పేర్కొన్నట్లు రమేష్‌బాబు తెలిపారు.
హత్య కేసు నమోదు
గాండ్లపెంట: ఉపాధి కూలీ మృతి కేసు మలుపు తిరిగింది. సమగ్ర దర్యాప్తు అనంతరం హత్య కేసుగా పోలీసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. గాండ్లపెంట మండలం కురుమామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టకిందపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఘర్షణలో అదే గ్రామానికి చెందిన ఉపాధి కూలీ చెన్నక రంగారెడ్డి (55) మృతి చెందిన విషయం తెలిసిందే. ఉపాధి బిల్లుల చెల్లింపుల విషయంగా ప్రశ్నించినందుకు క్షేత్ర సహయకుడు మనోహర్, ఆయన భార్య స్వాతి, మామ దాదెప్ప సోమవారం రాత్రి రాళ్లతో ఆయనపై దాడికి తెగబడ్డారు. ఘటనలో అపస్మారక స్థితికి చేరుకున్న రంగారెడ్డిని కుటుంబసభ్యులు వెంటనే కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. హతుడి వదిన వెంకటరత్నమ్మ ఫిర్యాదు మేరకు మనోహర్, స్వాతి, దాదెప్పపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
నీట మునిగి రాజస్థానీల మృతి
కళ్యాణదుర్గం రూరల్: ప్రమాదవశాత్తు నీట మునిగి రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజస్థాన్‌కు చెందిన జుట్టూ(22), భగత్‌సింగ్(25), సురేష్ బతుకు తెరువు కోసం కళ్యాణదుర్గం వలస వచ్చి ఉడ్‌వర్క్ షాప్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం కళ్యాణదుర్గం మండలం పాపంపల్లిలోని వెంకటేష్ బాబు తోటలోకి వెళ్లి, అక్కడ బొప్పాయి పండ్లను ఆరగించిన అనంతరం చేతులు శుభ్రం చేసుకునేందుకు నీటి ట్యాంక్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు జుట్టూ కాలు జారి ట్యాంక్ పడ్డాడు. గమనించిన భగత్‌సింగ్ వెంటనే ట్యాంక్‌లోకి దిగాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగిపోయారు. సురేష్, స్థానిక రైతుల నుంచి సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి యువకుల మృతదేహాలను వెలికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.