
మంత్రి ఇలాకాలో విద్యార్థులకు అందని కోడిగుడ్లు
పరిగి: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కోడి గుడ్లు అందకపోవడాన్ని నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం జైభీమ్ పార్టీ నాయకుడు ఊటుకూరు నాగరాజు ఆధ్వర్యంలో ఎంఈఎఫ్ నాయకుడు చౌళురు రవి తదితరులు మోకాలిపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డప్పు కొడుతూ ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దారు హనుమంతుకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఇవ్వడం లేదని మండిపడ్డారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి సవితమ్మ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి దుస్థితి ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించలేమన్నారు. ఇప్పటికై నా మంత్రి సవిత తన నియోజకవర్గంలో కోడిగుడ్ల ఏజెన్సీ నిర్వాహకుల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇటీవల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగిన రోజున సమావేశానికి వచ్చిన తల్లిదండ్రులకు మద్యాహ్న భోజనంలో కోడిగుడ్లను ఇవ్వడం జరిగిందని ఎంఈఓలు లక్ష్మీదేవి, శేషాచలం తెలిపారు. దీంతో కొరత కారణంగా సోమవారం కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కోడి గుడ్లను ఇవ్వలేకపోయారని వివరించారు.
డప్పు కొడుతూ నిరసన వ్యక్తం చేసిన జైభీం నాయకులు