
అలవాటు.. గ్రహపాటు
● హిందూపురానికి చెందిన ముగ్గురు కుర్రాళ్లు ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కారులో బయలుదేరి బెంగళూరు విమానాశ్రయం వెళ్తారు. తెల్లవారుజామున 3 గంటలకు తిరుగు పయనమవుతారు. తెల్లవారుజామున 5.30 గంటలకు పడుకుని ఉదయం 10.30 గంటలకు లేస్తారు. ఆ తర్వాత నేరుగా మధ్యాహ్న భోజనం తింటారు. దీంతో ఉదయం టిఫిన్ తినడం మానేశారు. ఫలితంగా ముగ్గురికూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పైగా మిగతా రోజుల్లో తెల్లవారుజాము వరకూ నిద్ర పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
● ‘కియా’ ఉద్యోగులు ఆరుగురు ఒకే విల్లాలో ఉంటారు. రోజూ రాత్రి 10 గంటలు దాటిన తర్వాత టీ తాగేందుకు బాగేపల్లి టోల్ గేట్ వరకు వెళ్తుంటారు. తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి 1 నుంచి 2 అవుతోంది. నిద్రపట్టేందుకు మరో గంట పడుతుంది. దీంతో అందరూ నిద్రలేచే సమయంలో నిద్రకు ఉపక్రమిస్తారు. మధ్యాహ్నం ఎప్పుడో నిద్రలేచి ఉన్నఫలంగా పది నిమిషాల్లో రెడీ అయి డ్యూటీకి వెళ్తున్నారు. నీరసం, నిద్ర ఒకేసారి వస్తుండటంతో విధులు కూడా సరిగా నిర్వహించలేక చివాట్లు తింటున్నారు.
కొంపముంచుతోన్న కల్చర్
సిటీ కల్చర్ పేరుతో జిల్లా యువత కొత్త హంగులకు వెళ్లి లేనిపోని రోగాల బారిన పడుతున్నారు. కొత్త కొత్త విధానాలకు అలవాటు పడి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ పెడదారి పడుతున్నారు. పుట్టపర్తి వంటి పట్టణాల్లో విదేశీయులు ఉండటంతో వారితో పరిచయం ఉన్నోళ్లు.. అర్ధరాత్రి వరకూ కాలయాపన చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఫలితంగా జీవనశైలిలో ఒక్కసారిగా వచ్చే మార్పులతో ఇబ్బందులు పడుతున్నారు.
సాక్షి, పుట్టపర్తి: జిల్లాలోని హిందూపురంతో పాటు చిలమత్తూరు, కొడికొండ చెక్‌పోస్టు, పెనుకొండ, పుట్టపర్తి ప్రాంతాల నుంచి యువత నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. టీ తాగాలంటే ఓ ప్రాంతం.. టిఫిన్ తినాలంటే మరో ప్రాంతానికి వెళ్లడం అలవాటుగా మార్చుకున్నారు. ఫలితంగా రాత్రింబవళ్లు తేడా లేకుండా తిరగడం మొదలుపెట్టారు. దీంతో జీవనశైలిలో మార్పులు రాగా రోగాల బారిన పడుతున్నారు.
అర్థరాత్రి చక్కర్లు..అనర్థాలు
జిల్లా యువకులు మెట్రో సిటీ యువతతో పోటీ పడాలని భావిస్తున్నారు. ఈక్రమంలో అర్ధరాత్రి వేళ కార్లలో చక్కర్లు కొట్టడం ఫ్యాషన్‌గా మార్చుకున్నారు. ఈ క్రమంలో జిల్లా నుంచి బెంగళూరుకు రయ్యిమంటూ దూసుకెళ్తున్నారు. అయితే జాతీయ రహదారి కావడంతో చాలామంది ప్రమాదాల బారిన పడి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. మరికొందరు ఇలా అర్ధరాత్రి తిరుగుళ్లకు అలవాటు పడి నిద్రలేమితో ఆస్పత్రుల బాట పడుతున్నారు. బెంగళూరు పక్కనే ఉండటంతో గంట వ్యవధిలో వెళ్లి రావచ్చనే ఉద్దేశంతో టక్కున వెళ్లి వస్తున్నారు. పగటి పూట పనుల్లో బిజీగా ఉంటూ రాత్రివేళ తిరిగేందుకు అలవాటు పడి నిద్రకు దూరమైన లేనిపోని రోగాల కొని తెచ్చుకుంటున్నారు.
యువకులే అధికం
అర్ధరాత్రి వేళ చక్కర్లు కొట్టే వారిలో యువకులే 90 శాతం మంది ఉండటం విశేషం. విధులు ముగించుకుని వారంతపు సెలవుల్లో అయితే మద్యం తాగుతారు. ఆ తర్వాత కారుతో రోడ్డెక్కుతారు. రయ్ రయ్ మంటూ బెంగళూరు వరకు వెళ్లాలని గ్యాంగ్‌లో ఎవరో ఒకరు పట్టుబడుతారు. ఫలితంగా ఇష్టం లేని వారు కూడా ప్రమాదమని తెలిసినా.. వెళ్లాల్సి వస్తోంది. ప్రయాణం రద్దు చేసుకుంటే సెల్ ఫోన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. మిగతా రోజుల మాదిరిగా నిద్ర రాకపోవడంతంతో అరచేతిలో స్మార్ట్ ఫోన్ తీసుకుని నొక్కుతూ కాలయాపన చేస్తున్నారు. బయట తిరగడం మానేసిన తర్వాత సెల్ ఫోన్‌తో బిజీ అవుతున్నారు. ఫలితంగా నిద్రకు దూరం అవుతున్నారు. నిద్రలేమి సమస్యలో ఆస్పత్రులకు చేరడం అలవాటుగా మార్చుకున్నారు.
యువత.. పెడదోవ
స్నేహితులతో కలిసి
బెంగళూరు వరకూ షికారు
అర్ధరాత్రి రయ్‌రయ్ మంటూ
రోడ్డుపై పయనం
మరికొందరు పొద్దుపోయే వరకూ
సెల్‌ఫోన్లలో బిజీ
ప్రమాదాలు, అనారోగ్యం బారిన
పడుతోన్న యువత
మానసిక, శారీరక సమస్యలతో
సతమతం

అలవాటు.. గ్రహపాటు