
అప్రజాస్వామిక ఎన్నికను బహిష్కరిస్తున్నాం
మడకశిర: అప్రజాస్వామికంగా బుధవారం నిర్వహిస్తున్న మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వైఎస్సార్ సీపీ బహిష్కరిస్తోందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, పలువురు కౌన్సిలర్లు స్పష్టం చేశారు. నగర పంచాయతీ ఎన్నికలో టీడీపీ నాయకులు అంబేడ్కర్ రాజ్యాంగానికి తిలోదకాలిచ్చారని వారు ఆరోపించారు. మంగళవారం ఈరలక్కప్ప పట్టణంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల సమావేశమై ఎన్నికపై చర్చించారు. టీడీపీ అరాచక పాలన, అనుసరిస్తున్న అప్రజాస్వామ్య చర్యలకు వ్యతిరేకంగా ఎన్నికను బహిష్కరించాలని నిర్ణయించారు. అనంతరం వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు రామచంద్రారెడ్డి, జయరాజ్, శ్రీనివాసులు, అంజన్‌కుమార్ యాదవ్, అన్సర్, వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ వాల్మీకి సతీష్‌కుమార్‌తో కలిసి ఈరలక్కప్ప విలేకరులతో మాట్లాడారు. నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను టీడీపీ నాయకులు అడ్డదారుల్లో గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏమాత్రం బలం లేకపోయినా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. అడ్డదారుల్లో ఎన్నికలో గెలవడం చేతగాని వారి పని అన్నారు. టీడీపీ నాయకులకు దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని సవాల్ విసిరారు. దళిత సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనరసమ్మను, బీసీ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రారెడ్డిని పదవుల నుంచి దించిన టీడీపీ... దళితులు, బీసీలకు తీరని అన్యాయం చేసిందన్నారు.
ప్రజలు వారిని క్షమించరు
పార్టీ మారి తల్లి లాంటి వైఎస్సార్ సీపీకి ద్రోహం చేసిన కౌన్సిలర్లను తాము క్షమించినా ప్రజలు క్షమించరని ఈరలక్కప్ప అన్నారు. పార్టీ ఫిరాయించిన వారెవరూ వచ్చే ఎన్నికల్లో గెలవలేరన్నారు. వారికి రాజకీయ సమాధి తప్పదన్నారు. ఈ ఎన్నిక తర్వాత పార్టీ మారిన కౌన్సిలర్లకు కూటమి నాయకులు గౌరవం ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు. వారంతా పార్టీ మారి తప్పు చేశామని కుమిలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు. టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజల్ని కోరుతామన్నారు. అంతేకాకుండా పార్టీకి ద్రోహం చేసిన కౌన్సిలర్లను పార్టీ నుంచి బహిష్కరిస్తామన్నారు.
మడకశిరలో అంబేడ్కర్ రాజ్యాంగానికి టీడీపీ తిలోదకాలు
పార్టీకి ద్రోహం చేసిన కౌన్సిలర్లకు
ప్రజా కోర్టులో శిక్ష తప్పదు
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ
సమన్వయకర్త ఈరలక్కప్ప, కౌన్సిలర్లు